'భారత్' అంత ముద్దు అయితే వన్ ఇండియా అన్నదెందుకు?

ఇండియా.. భారత్ అన్న రెండు పదాల్లో దేన్ని వాడినా పెద్ద తేడా లేదు. ఈ విషయాన్ని రాజ్యాంగం కూడా స్పష్టం చేస్తుంది

Update: 2023-09-06 04:54 GMT

భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశమన్నా.. ఇండియా అన్నా పెద్ద తేడా లేదు. ఏ రకంగా అయినా పిలుచుకునే సౌకర్యం.. సౌలభ్యాన్ని కల్పించింది. అయితే.. ఇటీవల విపక్ష కూటమి తమ పేరును 'ఇండియా' అన్న పేరును నిర్ణయించిన నాటి నుంచి కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో.. ఇండియా పేరును భారత్ గా మాత్రమే పిలిచే మార్పులు చేయటం ఇప్పుడు కొత్త దుమారమైంది. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో కలిగే సందేహం ఒక్కటే?

కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పాటై దగ్గర దగ్గర తొమ్మిదిన్నరేళ్లు కావొస్తోంది. భారత్ భావన మరీ అంత బలంగా ఉండి ఉంటే.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ మాటను ఎందుకు వినియోగించలేదు. అంత దాకా ఎందుకు తన మానపుత్రిక అయిన.. వన్ నేషన్.. వన్ ఇండియా అన్న నినాదానికి బదులుగా.. వన్ నేషన్ వన్ భారత్ అన్న మాట ఎందుకు మాట్లాడలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియా అన్న పదానికి బదులుగా భారత్ అన్న పదాన్ని వాడాలన్న నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేది. అదేం లేకుండా.. ఏకాఏకిన ఇంతకాలం అనుసరించిన విధానాల్ని మర్చిపోయి.. హటాత్తుగా మార్చేయటం మీదనే అభ్యంతరమంతా.

ఇండియా.. భారత్ అన్న రెండు పదాల్లో దేన్ని వాడినా పెద్ద తేడా లేదు. ఈ విషయాన్ని రాజ్యాంగం కూడా స్పష్టం చేస్తుంది. కాకుంటే దశాబ్దాల తరబడి ఇండియా ప్రైమ్ మినిస్టర్.. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటూ పిలవటం ఒక అలవాటుగా మారిన వేళ.. అందుకు భిన్నంగా ఇండియా అన్న పదం బదులుగా భారత్ అన్న పదాన్ని మాత్రమే వాడాలన్న నిర్ణయం హటాత్తుగా తీసుకోకుంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. తొమ్మిదిన్నరేళ్లుగా లేని ఫీలింగ్ ఇప్పుడే ఎందుకు వచ్చింది మోడీ? అన్నది ప్రశ్నగా మారింది.

తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిన్నటివరకు ఇండియా జపం చేసి.. ఇప్పుడు ఉన్నట్లుండి పేరు మార్చటంపైనే అభ్యంతరమంతా. తాము తీసుకున్న నిర్ణయాన్ని ఒక క్రమపద్దతిలో అమలు చేసి ఉంటే బాగుండేదేమో? అందుకు భిన్నంగా తమకు అనిపించింది అనిపించినట్లుగా అమల్లోకి తీసుకురావటమే పలువురి అభ్యంతరం. ఎందుకంటే.. మోడీ సర్కారు కాల వ్యవధి ఐదేళ్లు మాత్రమే. ఆ తర్వాత అధికారం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కానీ.. కీలక నిర్ణయాన్ని మెజార్టీ వర్గాల ఆమోదం తీసుకోవటం అవసరం.

ఎందుకంటే.. ఒంటెద్దు పోకడలతో తీసుకునే నిర్ణయాల్ని.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు మార్చేలా ఉంటే.. దాని వల్ల ఇబ్బందులు వచ్చేది దేశానికే తప్పించి.. దానికి సారధ్యం వహించే ప్రభుత్వాలకు కాదన్నది మర్చిపోకూడదు. చిన్నపిల్లల చేష్టల మాదిరి పేర్ల మార్పుపై నిర్ణయం అంతర్జాతీయంగా మనల్నినవ్వులపాలు అయ్యేలా చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Tags:    

Similar News