తెలంగాణా బీజేపీ మాత్రం ఉచితాలపైన గట్టిగానే?

తెలంగాణాకు తొందరలోనే జగరబోతున్న షెడ్యూల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ సీనియర్లు మేనిఫెస్టోపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు

Update: 2023-09-29 12:30 GMT

తెలంగాణాకు తొందరలోనే జగరబోతున్న షెడ్యూల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ సీనియర్లు మేనిఫెస్టోపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉచిత విద్య, వైద్యంపై బహిరంగ సభలో పార్టీ హామీ ఇచ్చింది. ఇవికాకుండా జనాలకు అవసరమైన ఇతర అంశాలపై ఇవ్వాల్సిన హామీలు ఏవి అనే విషయంలో కసరత్తు జరుగుతోంది. ఇవ్వబోయే హామీలు కేసీఆర్, కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలకు ధీటుగా ఉండేలా కమలనాథులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే నెల 6వ తేదీన పదాదికారుల సమావేశం జరగబోతోంది. అప్పటికి మేనిఫెస్టో డ్రాఫ్టుకు ఒక రూపాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు.

నిజానికి ఉచిత హామీలపై నరేంద్ర మోడీ చాలా వ్యతిరేకం. ఈ విషయాన్ని మోడీనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే బహిరంగ సభల్లో ఎన్ని మాటలు చెప్పినా, ప్రకటనలు చేసినా అంతమంగా కావాల్సింది అధికారం మాత్రమే. ఆ అధికారాన్ని అందుకోవటానికి పార్టీలు ఎన్ని హామీలను అయినా ఇచ్చేస్తాయి. ఇందులో భాగంగానే ఉచితాలకు మోడీ తాను వ్యతిరేకమని చెబుతున్నా తెలంగాణా బీజేపీ మాత్రం ఉచితాలపైన గట్టిగానే దృష్టిపెట్టింది.

పదాదికారుల సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. అప్పుడు మేనిఫెస్టో డ్రాఫ్టుపై చర్చించి ఆమోదం తీసుకోవాలని సీనియర్లు అనుకుంటున్నారు. అవసరమైతే నడ్డాతోనే ప్రధానమంత్రి లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో మాట్లాడించి గ్రీన్ సిగ్నల్ తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీకి కూడా చాలా కీలకమనే చెప్పాలి.

అందుకనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లు, హామీలను దగ్గర పెట్టుకుని సాధ్యాసాధ్యాలను చర్చించి మధ్యే మార్గంలో కొత్తగా మేనిఫెస్టో రూపంలో హామీలను ఇచ్చేట్లుగా కమలనాదులు వివిధ రంగాల్లోని నిపుణులతో చర్చిస్తున్నారు. ఉచిత విద్య, వైద్యం హామీతో పాటు నిరుద్యోగులు, విద్యార్ధులను ఆకట్టుకునేందుకు జాబ్ కాలెండర్, మధ్య తరగతి జనాలను ఆకర్షించేందుకు విద్యుత్ ఛార్జీల తగ్గింపు, పేదలకు ఇళ్ళ విషయంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం వర్తింపు లాంటి అనేక అంశాలపై కసరత్తు చేస్తున్నారు. మరి చివరకు ఏ స్ధాయిలో మేనిపెస్టోను తయారుచేస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News