టీడీపీతో పవన్ చెట్టాపట్టాల్ : ఏమీ అనలేని దైన్యంలో బీజేపీ...?

పవన్ కి ఏపీలో ఒక్క సీటు ఉంటే అది ఇపుడు లేదు. వైసీపీలో ఒక్క ఎమ్మెల్యే చేరిపోయారు. ఇక పవన్ చూస్తే 2019లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు

Update: 2023-10-04 14:30 GMT

పవన్ కి ఏపీలో ఒక్క సీటు ఉంటే అది ఇపుడు లేదు. వైసీపీలో ఒక్క ఎమ్మెల్యే చేరిపోయారు. ఇక పవన్ చూస్తే 2019లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. అయినా జనసేన చుట్టూ ఏపీ పాలిటిక్స్ తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేనను తెలివిగా తమ జట్టులోకి లాగేసుకుంది.

అయితే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ దాని గురించి ఏమీ తేల్చకుండానే టీడీపీ వెంట వెళ్లారు. ఇక తెలుగుదేశం జననసేన ప్రభుత్వం ఏపీలో వస్తుందని బల్ల గుద్దుతున్నారు. అసలు ఎక్కడా బీజేపీ ఊసు కానీ మాట కానీ ఆయన దగ్గర కనిపించడంలేదు.

దీంతో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిపింది. అయితే ఈ మీటింగులో ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదని అంటున్నారు. పవన్ ఇంకా బీజేపీకి మిత్రుడు కాబట్టి వేచి చూద్దామన్న ధోరణిలో కొందరు నాయకులు ఉన్నారుట. ఇక కేంద్ర బీజేపీ నాయకత్వమే పొత్తుల విషయంలో తీసుకోవాలని మరికొందరు అంటున్నారు.

పవన్ టీడీపీతో పొత్తు కలిపి దగ్గర దగ్గర నెల రోజులు కావస్తోంది. అయినా సరే బీజేపీ కేంద్ర నాయకత్వం మీద ఈ విషయంలో ఏమీ మాట్లాడడంలేదు. ఏపీలో జనసేన బీజేపీ పొత్తు ఉంది. అలాగే జనసేన టీడీపీ పొత్తు ఉంది. మరి ఇంతకీ జనసేన ఎవరితో పొత్తు అన్నది మాత్రం ప్రజలకు అర్ధం అవుతున్నా బీజేపీ పెద్దలకు కూడా అర్ధం అవుతున్నా వారు మాత్రం ఏ విధంగానూ రియాక్ట్ కాలేకపోతున్నారు అంటున్నారు

కేంద్రంలో బలమైన నాయకత్వం ఉంది. బలమైన పార్టీ మాది అని చెప్పుకునే బీజేపీ ఒక జాతీయ పార్టీగా ఉంటూ ఏపీలో కొత్తగా వచ్చిన జనసేన రాజకీయ చెలగాటం ఆడుతూంటే ఏమీ చేయలేక చతికిలపడింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి బీజేపీకి ఏపీ మీద ఆశ ఉంది. పవన్ని వదులుకోవద్దన్న ఆరాటం ఉంది.

అదే సమయంలో అటు వైసీపీ ఎంపీల మద్దతు కావాలి. ఇటు ఫ్యూచర్ లో చంద్రబాబు టీడీపీకి సీట్లు ఏమైనా పెరిగితే అవీ కావాలి. ఇలా అన్నీ రాజకీయ లెక్కలతో సీట్ల చిక్కులతోనే బీజేపీ ఏపీ వరకూ చూస్తే ఏమీ చేయలేని దైన్యంలో ఉంది అని అంటున్నారు.

అందుకే పవన్ కళ్యాణ్ టీడీపీతో చెట్టాపట్టాల్ వేస్తున్నా కూడా బీజేపీ మాత్రం అలా వేచి చూసే ధోరణిలోనే ఉంది. ఇక పవన్ అయితే టీడీపీ జనసేన పొత్తులో ఉంటాయని, ఇక రావాల్సి వస్తే మరే పార్టీలైనా అని రెండు రోజుల క్రితం మంగళగిరిలో జరిగిన కార్యకర్తల మీటింగులో చెప్పేశారు. అంటే ఆయన బాల్ ని తెచ్చి బీజేపీ కోర్టులో పడేసారు. కానీ బీజేఈ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది.

అదే సమయంలో ఏపీ రాజకీయాల్లో తన పాత్ర ఏమిటి అన్న క్లారిటీ మిస్ కావడంతో జనంలోనూ అభాసుపాలు అవుతోంది అని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీ రాజకీయాల విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో.

Tags:    

Similar News