గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలన్నది బీజేపీ టార్గెట్. అయితే అందుకు అవకాశాలు ఉన్నాయా అన్నది వేరే సంగతి. ఒకపుడు నిజంగానే అంత ఊపుండేది.

Update: 2023-07-24 06:22 GMT

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలన్నది బీజేపీ టార్గెట్. అయితే అందుకు అవకాశాలు ఉన్నాయా అన్నది వేరే సంగతి. ఒకపుడు నిజంగానే అంత ఊపుండేది. కానీ ఇపుడా ఊపంతా బాగా చల్లబడిపోయింది. ఈ నేపధ్యంలోనే అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ స్ధానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అగ్రనేతలు బాధ్యతలు అప్పగించారు. రెండురోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్న కిషన్ తాజాగా గ్రేటర్ హైదరాబాద్ నేతలతో భేటీ అయ్యారు. అనుబంధ శాఖలు, సోసల్ మీడియా విభాగం, కార్పొరేటర్లు తదితరులతో సుదీర్ఘంగా మాట్లాడారు.

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గ్రేటర్ పరిధిలోని మెజారిటి సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టారు. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒకపుడు బీజేపీకి నలుగురు ఎంఎల్ఏలుంటే వారిలో నలుగురూ గ్రేటర్ లో గెలిచిన వారే. అంటే గ్రేటర్ పరిధి దాటితే బీజేపీ బలం అంతంతమాత్రమే. కానీ పోయిన ఎన్నికల్లో గ్రేటర్ పరిధి ఇంకా చెప్పాలంటే ఓల్డ్ సిటీలోని గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ తప్ప ఇంకెవరూ గెలవలేదు. 119 నియోజకవర్గాలకు బీజేపీ పోటీచేస్తే గెలిచింది రాజాసింగ్ ఒక్కడే.

అందుకనే వచ్చేఎన్నికల్లో గెలుపును కిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పార్టీకి సుమారు 45 మంది కార్పొరేటర్లున్నారు. వాళ్ళతో పాటు సీనియర్ నేతలు, డివిజన్ల అధ్యక్షులు, ముఖ్యనేతలతో పాటు సోషల్ మీడియా విభాగం ముఖ్యలతో కిషన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. షెడ్యూల్ ఎన్నికలకు ఉన్నది ఇక నాలుగు నెలలే కాబట్టి ఇప్పటినుండే అందరు గెలుపును సీరియస్ గా తీసుకోవాలన్నారు. తమ డివిజన్, నియోజకవర్గాల పరిధుల్లో అందరు ఇంటింటింకి తిరిగి ప్రచారం చేయాలన్నారు.

అలాగే సోషల్ మీడియా వింగ్ మరింత యాక్టివ్ గా ప్రచారం చేయాలని కిషన్ ఆదేశించారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధిని జనాలకు చేరవేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా వింగ్ పైనే ఉందన్నారు. ఇదే సమయంలో కేసీయార్ ప్రభుత్వంలోని లోపాలు, అవినీతి, అరాచకాలను కూడా జనాలకు చేరవేయాలని చెప్పారు. మరి కిషన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.

Tags:    

Similar News