బీజేపీ జగన్ ఒకటేనా... కూటమికే చేటు కదా ...!

ఇలా శుభమాని అంతా అనుకుంటున్న తరుణంలో కూటమిలో ఉన్న బీజేపీ జగన్ ఒక్కటే అంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

Update: 2024-03-11 09:51 GMT

బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో చేరింది. ఇది అధికారిక పొత్తుగా ఖరారు అయింది. ఈ పొత్తు ముందుకు సాగాలని కూటమి పెద్దలు మనసారా కోరుకుంటున్నారు. ఇలా శుభమాని అంతా అనుకుంటున్న తరుణంలో కూటమిలో ఉన్న బీజేపీ జగన్ ఒక్కటే అంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ మోడీ అమిత్ షా ఈ ముగ్గురూ కలసి ఒక పధకం ప్రకారం చంద్రబాబుని యాభై మూడు రోజుల పాటు జైలులో పెట్టించారు అని సంచలన ఆరోపణలు చేశారు.

కేంద్ర బీజేపీ పెద్దల సహకారంతోనే జగన్ బాబుని అరెస్ట్ చేయగలిగారు అని ఆయన స్పష్టం చేస్తున్నారు. అలా బాబుకి ఏడున్నర పదుల వయసులో జైలు జీవితాన్ని తొలిసారిగా చూపించిన బీజేపీని ఎలా కూటమిలోకి రానిస్తారు అని కామ్రేడ్ ప్రశ్నిస్తున్నారు.

ఈ మాట మొదటి నుంచి వామపక్షాలు అంటున్నదే. చంద్రబాబు అరెస్ట్ వెనక కాషాయ దళం ఉందని ఆరోపిస్తున్నదే. ఆ అనుమానం తమ్ముళ్ళకు కూడా ఉంది. అయితే ఇపుడు బీజేపీ టీడీపీ మిత్రులు అయ్యారు రెండు పార్టీలు కలసి ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ఈ సమయంలో కామ్రేడ్ రామకృష్ణ ఈ విషయం బయటపెట్టడం కానీ చెప్పడం కానీ చేయడం వల్ల జరిగే నష్టం కూటమికే అని అంటున్నారు.

కూటమిలో బీజేపీకి ఇచ్చే ఆరు ఎంపీ సీట్లు కానీ ఎనిమిది దాకా ఎమ్మెల్యే సీట్లు కానీ గెలుచుకునేందుకు అవకాశం ఉండకుండా ఈ కామెంట్స్ పనిచేస్తాయని అంటున్నారు. అసలే బీజేపీ మీద అనుమానం అసహనంతో ఉన్న తమ్ముళ్లు బాబు జైలు గురించి తలచుకుని మరీ యాంటీగా పనిచేస్తే ఆ నష్టం కూటమి మొత్తానికే అని అంటున్నారు.

అదే టైం లో బీజేపీ జగన్ ఒక్కటే అని చెప్పడం వల్ల వైసీపీకి లాభమే తప్ప నష్టం లేదని అంటున్నారు. వ్యవస్థలను అనుకూలం చేసుకోవడానికే బాబు బీజేపీతో పొత్తుకు ముందుకు వచ్చారు. ఇపుడు చూస్తే కనుక జగన్ బీజేపీ అంతా ఒక్కటే అన్న కామ్రేడ్ ఇచ్చే సంకేతాలు టీడీపీ సంగతేమో కానీ వైసీపీకి మేలు చేసేవిగానే ఉంటాయని అంటున్నారు.

బీజేపీ బ్లాక్ మెయిల్ చేసి చంద్రబాబుని తమ వైపు తిప్పుకుందని రామకృష్ణ ఆరోపిస్తున్నారు. బాబుని జైలుకు పంపింది వాళ్ళే ఆయనను కేసులతో లొంగదీసుకుంటోంది వాళ్ళే అని ఆయన విమర్శిస్తున్నారు. ఈ విధంగా బీజేపీ మీద నిప్పులు చెరుగుతూ పొత్తుకు పోయిన బాబుని మాత్రం రామకృష్ణ పల్లెత్తు మాట అనడంలేదు. దాని వల్ల కూటమికే చేటు వస్తుందని అంటున్నారు.

బాబు అమాయకంగా బీజేపీ వలలో చిక్కుకున్నారు అని అర్ధం వచ్చేలా రామకృష్ణ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీ పెద్దలకు నిజంగా బాబు అరెస్ట్ జైలు జీవితం విషయంలో ప్రమేయం ఉందా అంటే ఇది చాలా మందిలో అనుమానంగానే ఉంటున్న ప్రశ్న. కూటమిలో ఈ అనుమానం చెలరేగితే ఆ దావానలంలో పొత్తు ప్రయోజనాలు మంట కలుస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News