ఈటల విషయంలో కేసీఆర్ ప్లానిదేనా ?
ఈటల రాజేందర్ అంటే కేసీయార్లో ఎంత కసుందో తాజాగా బయటపడింది.
ఈటల రాజేందర్ అంటే కేసీయార్లో ఎంత కసుందో తాజాగా బయటపడింది. ఇదే సమయంలో ఈటల మీద ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో కూడా అర్ధమైంది. టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈటల ఎవ్వరిని ఎదగనియ్యలేదని ఆరోపించారు. ముదిరాజ్ కులస్తుల్లో ఒక్కళ్ళని కూడా ఈటల పైకి రానీయలేదన్నారు. ఈటల పార్టీని వదిలిపోయిన తర్వాత బండా ప్రకాష్ ను తీసుకొచ్చి ఎంపీగా, ఎంఎల్సీగా కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చేసినట్లు చెప్పారు.
ఇక్కడే కేసీయార్ చెప్పినవన్నీ అబద్ధాలే అని అర్ధమైపోతోంది. ఎలాగంటే బీఆర్ఎస్ పార్టీలో, మంత్రివర్గంలో ఈటల కూడా ఒక సభ్యుడు మాత్రమే. కేసీయార్ ను శాసించేంత స్ధాయిలో ఈటల ఎప్పుడూ లేరు. ఎందుకంటే పార్టీకైనా ప్రభుత్వంలో అయినా బాస్ కేసీయారే కానీ ఈటల కాదు. ముదిరాజ్ సామాజికవర్గంలో ఎవరినైనా కేసీయార్ ప్రోత్సహించదలచుకుంటే ఈటల అడ్డుపడ్డారా ? ఈటల అడ్డుపడితే కేసీయార్ వెనక్కు తగ్గిపోతారా ? ఒకళ్ళు అడ్డుపడితే కేసీయార్ వెనక్కు తగ్గే రకమేనా ?
ముదిరాజ్ సామాజిక వర్గం లో ఈటల చాలని కేసీయార్ అనుకోబట్టే ఇంకెవరినీ పికప్ చేయలేదు. వివాదం కారణంగా ఈటల బీఆర్ఎస్ నుండి బయటకు వెళ్ళిపోయినపుడైనా ముదిరాజ్ నుండి పదిమందిని కేసీయార్ నేతలుగా ఎందుకు తయారు చేయలేదు ? ఒక్క బండా ప్రకాష్ కు మాత్రమే ఎంపీగా, ఎంఎల్సీగా, కౌన్సిల్ వైస్ ఛైర్మన్ గా అవకాశమిచ్చారు. మూడు పదవులను ముదిరాజ్ సామాజికవర్గంలోని ముగ్గురు నేతలకు ఇచ్చుండచ్చు కదా ? స్ధానిక సంస్ధల పదవుల్లో ముదిరాజులకు పెద్ద పీట వేస్తామని కేసీయార్ చెప్పారు. మరి ఎంఎల్ఏ టికెట్లలో ముదిరాజులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో కేసీయార్ చెప్పగలరా ?
తప్పులన్నీ తానుచేసి ఇతరుల మీదకు నెట్టేయటంలో కేసీయార్ కు అలవాటే. ముదిరాజ్ లకు పెద్దపీట వేయద్దని ఏరోజైనా ఈటల రాజేందర్ చెప్పారా ? అసలు కేసీయార్ను శాసించేంత సీన్ బీఆర్ఎస్ లో ఎవరికైనా ఉందా ? పార్టీకి ముదిరాజ్ అవసరం లేదని కేసీయార్ అనుకున్నారు అవకాశాలు ఇవ్వలేదంతే. ఎన్నికల సమయంలో ఇపుడు అవసరం వచ్చిందనుకున్నారు కాసానిని పట్టుకొచ్చారు. కాసాని జాయినింగ్ మీటింగులో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేసి ముదిరాజ్ లలో ఈటలపై వ్యతిరేకత తీసుకురావాలన్నదే ప్లాన్ అని అర్ధమవుతోంది.