కొత్త పరిణామం... ముద్రగడతో బీజేపీ నేతల చర్చలు!!
అవును... ఏపీలో ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు కీలకం అని చెబుతున్న సంగతి తెలిసిందే
ఏపీ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రతీ రోజూ క్లైమాక్స్ లా ఉంటుంది. పార్టీలు చేస్తున్న వ్యూహాలు.. వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. వెల్లడిస్తున్న ఆశయాలు.. వెరసి ఏపీలో రసవత్తర రాజకీయం తెరపైకి వస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఏపీలో బీజేపీ సరికొత్త రాజకీయానికి తెరతీసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ముద్రగడకు లైన్ లోకి తీసుకున్నట్లు సమాచారం!!
అవును... ఏపీలో ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు కీలకం అని చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే... పవన్ తమతో కలిస్తే టీడీపీకి కాపుల ఓట్లు బలంగా పడతాయని నమ్మిన చంద్రబాబు.. జనసేన తో పొత్తుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు కార్యక్రమాలు కాస్త గరం గరంగా సాగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో బీజేపీ సరికొత్త రాజకీయానికి తెరతీసిందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... ఏపీలో జనసేనతో మాత్రమే తమ పొత్తు ఉంటుందని తొలి నుంచి చెబుతూ వస్తున్న బీజేపీ... ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహాన్ని వెలుగులోకి తెస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా పవన్ ను ఢిల్లీకి రావాలని సమాచారం ఇచ్చిందని తెలుస్తుంది. దీంతో... తమతో కలిసి ప్రయాణం చేసే విషయంలో పవన్ తో బీజేపీ పెద్దలు ఒక కచ్చితమైన అభిప్రాయానికి రావడానికే ఈ పిలుపు అని అంటున్నారు.
ఈ సమయంలో పవన్... బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా చంద్రబాబుతోనే వెళ్లడానికి నిశ్చయించుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి! అయితే... ఈలోపు ప్లాన్ బీ లో భాగమో.. లేక, పవన్ ముందస్తు హెచ్చరికల్లో భాగమో తెలియదు కానీ... జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారని చెబుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడతో బీజేపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవంగా ముద్రగడ ఇప్పటికే జనసేనలో చేరి ఉండాల్సింది అని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా... స్వయంగా పవన్ కల్యాణే కిర్లంపూడి వెళ్లి ముద్రగడను జనసేనలోకి ఆహ్వానించాలని నిర్ణయించారని కథనాలొచ్చాయి. అయితే... బీజేపీ నేతలు టచ్ లోకి రావటంతోనే ముద్రగడ ఈ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది! దీంతో... ముద్రగడ నిర్ణయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
అయితే... పవన్ మాత్రం నూటికి నూరు శాతం టీడీపీతోనే కలిసి వెళ్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో... బీజేపీ నేతలను తమతో కలిసి నడిచేలా ఒప్పించగలిగితే 2014 టీం రెడీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే.. అందుకు బీజేపీ నేతలు ఒప్పుకోని పక్షంలో... పవన్ కటీఫ్ చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సమయంలోనే బీజేపీ తనదైన వ్యూహాలను అమలుచేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్నట్లుగానే ఏపీలో కాపు సీఎం నినాదంతో ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే కాపు ఓట్లలో బలమైన చీలిక వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా... ఏపీలో టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటారని ఇటీవల లోకేష్ కుండబద్దలు కొట్టి చెప్పిన సంగతి తెలిసిందే!!