గమనించారా... వైసీపీ తప్ప అంతా లైట్ తీసుకుంటున్నారే...!?

ఏపీలో కాంగ్రెస్ కి కొత్త ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిల వచ్చారు. ఆమె అపుడే మీడియా ముందుకు వచ్చి అధికార వైసీపీని అలాగే టీడీపీని బీజేపీని కూడా విమర్శించారు.

Update: 2024-01-23 04:16 GMT

ఏపీలో కాంగ్రెస్ కి కొత్త ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిల వచ్చారు. ఆమె అపుడే మీడియా ముందుకు వచ్చి అధికార వైసీపీని అలాగే టీడీపీని బీజేపీని కూడా విమర్శించారు. ఆ మరుసటి రోజు రాహుల్ గాంధీని అసోం టూర్ లో ఒక గుడిలోకి వెళ్లకుండా బీజేపీ వారు అడ్డుకున్నారు అన్న వార్తల మీద విజయవాడలో ఆందోళన నిర్వహించారు. బీజేపీ డౌన్ డౌన్ అన్నారు. మోడీ మీద కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.

అయినా సరే బీజేపీ నుంచి ఒక్కటంటే ఒక్క విమర్శ షర్మిల మీద రాలేదు. నిజానికి షర్మిల కాంగ్రెస్ లో చేరింది మొదలు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అంటూ బీజేపీని విమర్శిస్తూనే ఉన్నారు. మణిపూర్ ఘటనలను ఆమె తప్పు పడుతూనే ఉన్నారు. మరి బీజేపీ కాంగ్రెస్ నుంచి వచ్చే ప్రతీ విమర్శకూ కౌంటర్ చేస్తుంది.

కానీ తమాషాగా షర్మిల ఏపీకి వచ్చి రెండు రోజులుగా బీజేపీని విమర్శిస్తున్నా కూడా ఏపీ బీజేపీ నేతలు కౌంటర్ చేయడం లేదు. అంతే కాదు టీడీపీ అధినేత చంద్రబాబుని ఎవరు ఏమన్నా తమ్ముళ్ళు ఆవేశంతో ఊగిపోతారు. ఇక షర్మిల వైసీపీలో ఉన్నపుడు పల్లెత్తు మాట అన్నా స్పీడ్ గా కౌంటర్లు వచ్చి పడేవి.

అలాంటిది ఆమె చంద్రబాబుని పట్టుకుని ప్రత్యేక హోదా తేలదని విమర్శించారు. ఏపీని అప్పుల్లో ముంచారని అన్నారు. గ్రాఫిక్స్ తో అమరావతి రాజధానిని కట్టలేకపోయారు అని తూర్పారా పట్టారు. మరి ఇన్నేసి మాటలు అన్నా టీడీపీ తమ్ముళ్ళు సైలెంట్ అయ్యారు.

చూడొబోతే ఇది భలే తమాషాగానే ఉంది అని అంటున్నారు. అయితే షర్మిల ఎక్కువ వైసీపీ మీదనే టార్గెట్ చేశారు అన్నది వాస్తవం. నిజానికి చూస్తే అలా చేయాలి కూడా ఎందుకు అంటే ఏపీలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. వారినే ఎక్కువగా అంటారు.

అయితే వైసీపీ నేతలు వెంటనే షర్మిలకు కౌంటర్లు వేయడం ఆమెనే డైరెక్ట్ గా విమర్శించడం ఎవరి ప్రయోజనాల కోసం ఆమె ఏపీకి వచ్చిందో అని సజ్జల నుంచి ఆమె బాబాయ్ వైవీ వరకూ ఇంకా అనేక మంది నేతలు కామెంట్స్ చేయడంతో షర్మిల వైపు నుంచి కూడా దాడి పెరుగుతోంది. మొత్తం మీద చూస్తే వ్యూహాత్మకంగా అన్నట్లుగా విపక్షాలు అన్నీ షర్మిల విమర్శలను పట్టించుకోవడంలేదులా ఉంది. అలాగే లైట్ తీసుకుంటున్నాయి.

ఇక్కడ మరో మాట కూడా ప్రచారంలో ఉంది. షర్మిల కేవలం పవన్ కళ్యాణ్ లాగా ఒక్క జగన్ మీదనే కాకుండా చంద్రబాబుని కూడా అంటున్నారు. జగన్ని నాలుగు విమర్శిస్తే బాబుని ఒకటి అంటున్నారు. అలా ఏదో లెక్క అయితే ఫాలో అవుతున్నారు. దీని వల్ల తాను వైసీపీ వ్యతిరేకం అని కాకుండా మొత్తం టీడీపీ వైసీపీకి రెండింటికీ అని చెప్పదలచుకున్నారు అని అంటున్నారు.

అయితే షర్మిల రాక వెనకాల ఆంతర్యం ఆమె వైసీపీ మీద చాలా గట్టిగా విరుచుకుపడుతున్న తీరు అన్నింటికీ మించి రాజన్న వారసత్వం విషయంలో జగన్ తో షర్మిలకు ఉన్న పంచాయతీ ఇవన్నీ చూస్తున్న విపక్షాలు ఆమె వల్ల తమకు మేలు తప్ప ఇబ్బంది లేదని భావనకు రాబట్టే మౌనంగా ఉన్నారని అంటున్నారు. అదే టైం లో ఆమె విమర్శలు తమకు కొంత ఇరకాటం అని భావించే వైసీపీ రియాక్ట్ అవుతోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే షర్మిల ఏపీలో వైసీపీకి కాంగ్రెస్ ఆల్టర్నేషన్ అని చెప్తున్నా జనాలు నమ్మేది లేదు, ఆ సీన్ కాంగ్రెస్ కి లేదు అనే అంటారు

ఆమె ఎంతలా అధికార పార్టీని విమర్శిస్తే అంతలా తమకు నోటి నొప్పి ఆయాసం తగ్గుతాయని భావిస్తూ అన్నా చెల్లెలు సమరాన్ని వినోదంగా విపక్షాలు చిత్తగిస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి షర్మిల విపక్షాల మీద ఎంత విమర్శ చేసినా వారు సైలెంట్ గానే ఉంటారా ఉంటే ఎన్నాళ్ళు ఉంటారు అన్న దానిని బట్టి కూడా జనాలు అన్నీ ఆలోచించుకుంటారు అని అంటున్నారు.

Tags:    

Similar News