ప్రజాసేవకుడు... కమిషన్‌ ఇవ్వలేదని రోడ్డు తవ్వించేసిన ఎమ్మెల్యే..?

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని షాజహాన్‌ పుర్‌ - బుదౌన్‌ ల మధ్య పీడబ్ల్యూడీ విభాగం ఇటీవల రోడ్డు నిర్మాణం చేపట్టింది.

Update: 2023-10-12 16:20 GMT

ఈ దేశంలో ప్రజాసేవకులం అని చెప్పుకుంటూ ప్రజా రక్షకులుగా కాకుండా ప్రజా భక్షకులుగా ఉన్న రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారనే విషయం రెగ్యులర్ గా వార్తల్లో చూస్తూనే ఉంటాం! ఈ క్రమంలో తాజాగా కమిషన్ అందలేదని ఆగ్రహించిన ప్రజాసేవకుడు ఒకరు వెలుగులోకి వచ్చారని తెలుస్తుంది! ఇందులో భాగంగా ఆయనకు కమిషన్ అందలేదని ఏకంగా కొత్తగా వేసిన రోడ్డునే తవ్వించేసిన మహానుభావుడు అతను అని అంటున్నారు!

అవును... కాంట్రాక్టర్‌ కమిషన్‌ ఇవ్వలేదని స్థానిక బేజేపీ ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా వేసిన రోడ్డునే తవ్వేశారని తెలుస్తుంది. పనిగట్టుకుని ఒక బుల్డోజర్‌ ని తెచ్చిమరీ వేసిన రోడ్డును తవ్వేశారు. దీంతో ఈ విషయం స్థానికంగానే కాకుండా... దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని షాజహాన్‌ పుర్‌ - బుదౌన్‌ ల మధ్య పీడబ్ల్యూడీ విభాగం ఇటీవల రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీంతో... స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వీర్‌ విక్రం సింగ్‌ అనుచరులమని చెప్పి కొందరు దుండగులు సదరు కాంట్రాక్టరును 5 శాతం కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు కాంట్రాక్టర్‌ నిస్సందేహంగా నిరాకరించారు!

దీంతో ఆగ్రహించిన సదరు దుండగులు.. రోడ్డు వేస్తున్న కార్మికులపై దాడి చేశారు.. అనంతరం ఒక బుల్డోజర్‌ తెచ్చి.. సుమారు 3 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసినట్లు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కాంట్రాక్టర్ పేర్కొన్నాడు. ఈ వ్యవహారం యూపీతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ప్రజాసేవకులమని చెప్పుకునేవారు ఇలా కూడా ఉంటారా అనే చర్చ మొదలైంది.

ఈ వ్యవహారాన్ని సీరియస్‌ గా తీసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోడ్డు తవ్విన వారినుంచే ఆ నష్టాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. మరోవైపు కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వీర్‌ విక్రం సింగ్‌ స్పందించారు. ఈ కేసులో నిందితులు బీజేపీ కార్యకర్తలేకానీ.. తన అనుచరులు కాదని చెప్పుకొచ్చారు.

దీంతో... ఇతను మాత్రం తప్పించుకుని.. పార్టీని ఇరకాటంలో పాడేస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఒక నియోజకవర్గంలో అధికారపార్టీ కార్యకర్తలు.. స్థానికంగా ఉన్న అధికారపార్టీ ఎమ్మెల్యే అనుచరులు, సానుభూతిపరులు కాకుండా పోతారా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News