తుమ్మల విషయంంలో ఈటల కీలక వ్యాఖ్యలు!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇందులో భాగంగా అధికార బీఆరెస్స్ కు పోటీగా విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.

Update: 2023-08-27 13:26 GMT

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇందులో భాగంగా అధికార బీఆరెస్స్ కు పోటీగా విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. పైగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి బీఆరెస్స్ విపక్షాలకు సవాల్ విసరగా... ఆ పార్టీలోని అసంతృప్తులకు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యామ్నాయాలుగా మారాయి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ లో చేరికలు కాస్త జోరుగానే సాగాయని చెప్పాలి. సరిగ్గా ఆ ఫలితాల తర్వాత బీజేపీలో చేరికలు తగ్గాయి. ఇదే సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్ది చేరికతో ఖమ్మం లో కాంగ్రెస్ బలపడగా.. ఓవరాల్ గా పాజిటివ్ సంకేతాలు వచ్చాయి.

ఈ సమయంలో తుమ్మల నాగేశ్వర రావు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తుమ్మల కు కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. అనంతరం ఆయన అనుచరులు మాత్రం ఆయనకు భారీగా ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేయమని ఒత్తిడి తెస్తున్నట్లు కథనాలొస్తున్నాయి.

ఈ సమయంలో తుమ్మల మాత్రం ఇంకా ఆలోచనా ధోరణిలోనే ఉన్నారని సమాచారం. ఈ సమయంలో తుమ్మల విషయంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు టికెట్ ద‌క్కని తుమ్మల‌తో అక్కడి నుంచి బ‌రిలో దించ‌డంపై ఆయ‌న‌తో చర్చిస్తామ‌ని అన్నారు.

అవును... బీజేపీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తుమ్మలపై స్పందించారు. ఇందులో భాగంగా... తుమ్మలను అవసరానికి వాడుకుని వదిలేశారని ఈట‌ల విమ‌ర్శించారు. బీజేపీలో చేరిక విషయంలో తుమ్మలతో చర్చిస్తామని తెలిపారు.

కాగా... ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ బ‌లంగా ఉందని అంటున్నారు. దీంతో బీజేపీ, బీఆరెస్స్ లు త‌మ వంతు ప్రయ‌త్నాలు చేస్తున్నాయి. మరోపక్క తుమ్మల అనుచ‌రులు మాత్రం కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేయాల‌ని ఆయ‌న‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన తాజా ర్యాలీలో... బీఆరెస్స్ జెండాలు లేకుండా చేశారు.

మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వర రావు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో... త‌న అనుచ‌రుల అభిప్రాయాన్ని గౌర‌వించి తుమ్మల కాంగ్రెస్‌ లో చేరుతారా? లేక బీజేపీ ఆహ్వానాన్ని మ‌న్నించి కాషాయ కండువా క‌ప్పుకుంటారా? అదీగాక.. మరో ఆలోచన ఏమైనా చేస్తారా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News