కరెక్ట్ టైం చూసి వరుణ్ గాంధీకి చెక్ పెట్టిన బీజేపీ...!
యూపీలో 2024 ఎన్నికలకు సంబంధించి చాలా మంది సిట్టింగులకు సీట్లు రాకుండా పోయాయి.
యూపీలో 2024 ఎన్నికలకు సంబంధించి చాలా మంది సిట్టింగులకు సీట్లు రాకుండా పోయాయి. అయితే అందులో చూస్తే యువ నేత గాంధీ కుటుంబ సభ్యుడు అయిన వరుణ్ గాంధీకి టికెట్ లేకపోవడం విస్మయం కలిగించింది. వరుణ్ గాంధీ సంజయ్ గాంధీ మేనకా గాంధీ కుమారుడు. ఇందిరాగాంధీ మనవడు.
ఆయన గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు. ఎంతో పొలిటికల్ లెగసీ ఉన్న వారు. ఆయన తల్లి మేనకా గాంధీ మూడు దశాబ్దాలుగా బీజేపీలో ఉంటూ ఆ పార్టీకి విశ్వాసపాత్రురాలిగా ఉన్నారు. వాజ్ పేయ్ క్యాబినెట్ లో కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు.
ఆమె పిలిభిత్ నుంచి మొదట్లో ప్రాతినిధ్యం వహించేవారు. వరుణ్ గాంధీ కోసం ఆమె ఆ సీటుని వదిలేశారు. అలా 1996 నుంచి మేనకా గాంధీ వరుణ్ గాంధీల వద్ద ఉన్న పిలిభిత్ లోక్ సభ నియోజకవర్గం ఇపుడు జారిపోయింది. దానిని బీజేపీ అధినాయకత్వం వరుణ్ గాంధీకి కాకుండా చేసి సరైన సమయంలో చెక్ పెట్టేసింది.
ఆ సీటు నుంచి బీజేపీ నేత జిత్రేంద్ర ప్రసాద పోటీ చేయనున్నారు. అదే సమయంలో ఆయన తల్లి మేనకా గాంధీని సుల్తాన్‌పూర్ నుండి తిరిగి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అంటే వరుణ్ గాంధీ సేవలు పార్టీకి అవసరం లేదని చెప్పడమే అంటున్నారు. అదే సమయంలో మేనకాగాంధీని కంటిన్యూ చేయడం ద్వారా గాంధీ కుటుంబంతో కొనసాగింపు ఉందని స్పష్టం చేశారు.
వరుణ్ గాంధీ రాజకీయం ఎందుకు ఇలా పతనం అంచులకు చేరింది అంటే ఆయన యూపీ సీఎం యోగీతో డైరెక్ట్ ఫైట్ చేస్తున్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా గత అయిదేళ్ళలో వ్యవహరించారు అని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా టైంలో మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను జనతా కర్ఫ్యూ వంటి వాటిని వరుణ్ తీవ్రంగా వ్యతిరేకించారు అని అంటున్నారు
అంతే కాదు అప్పట్లో లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టెనీకి చెందిన వాహనాలు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మీద విపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నాయి. వారితో పాటు వరుణ్ గాంధీ జత కలిపారు. సొంత పార్టీ మీద ప్రభుత్వం మీద ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.
ఇక ఆయన తరచూ తన పార్టీ అనుచరులతో మాట్లాడుతూ సన్యాసి అయితే చాలు ముఖ్యమంత్రి అయ్యేందుకు అర్హత అంటూ యోగీ మీద కూడా విరుచుకుపడుతూ వచ్చారని అంటున్నారు. ఇదిలా ఉంటే వరుణ్ గాంధీ 2013 దాకా బీజేపీలో మంచి వైభోగం చూశారు. ఆయనను నరేంద్ర మోదీ జాతీయ రంగంలోకి రావడానికి ఒక సంవత్సరం ముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అలాగే పశ్చిమ బెంగాల్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అయినప్పటికీ ఆయన సంస్థాగత పనిపై ఎప్పుడూ ఆసక్తి చూపలేదన్న విమర్శలు ఉన్నాయి.
ఇక 2017లో జరిగిన యూపీ ఎన్నికల కంటే ఏడాది ముందు తనకు తానుగా యూపీ సీఎం గా ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడం పోస్టర్లు వేయడం కూడా బీజేపీ హై కమాండ్ దృష్టిలో ఉన్నాయని అంటున్నారు. ఆయన కేంద్ర మంత్రి పదవిని కోరుకున్నా అందుకే దక్కలేదు అని అంటారు.
ఇక ఆయనకు గాంధీ కుటుంబం అంటే సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీతో బంధాలు కొత్తగా ఏర్పడ్డాయన్న అనుమానాలు కూడా కమలనాధులకు ఉన్నాయట. మొత్తానికి ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువ నేత బీజేపీలో దూకుడు చర్యల వల్ల పొలిటికల్ కెరీర్ లేకుండా చేసుకున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఈ ఒక్కసారితో మేనకాగాంధీకి కూడా బీజేపీలో పోటీకి అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఎస్పీకి వరుణ్ గాంధీ దగ్గర అవుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.