తొలి దశలో బీజేపీకి కలసి వచ్చే సీట్లు ఎన్ని ?
దేశంలో కొత్త లోక్ సభ ఏర్పాటు కోసం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి తొలి పోలింగ్ ఈ నెల 19న జరగనుంది
దేశంలో కొత్త లోక్ సభ ఏర్పాటు కోసం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి తొలి పోలింగ్ ఈ నెల 19న జరగనుంది. మొత్తం 102 ఎంపీ సీట్లలో పోలింగ్ జరగబోతోంది. అంటే 543 ఎంపీ సీట్లలో ఇది అయిదవ వంతు అన్న మాట. ఇరవై శాతం ఎంపీ సీట్లకు జరిగే ఈ పోలింగ్ ఏ ఏ రాష్ట్రాలలో ఉంది అంటే చాలా ఆసక్తికరమే.
21 రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పోలింగ్ మొదటి విడతలో జరగబోతోంది. ఆ ఇరవై ఒక్క రాష్ట్రాలలో దక్షిణాదిన తమిళనాడు ఉంది. మొత్తం 39 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ బీజేపీకి కొంచెం ఆశలు కొత్త ఆశలు ఉన్నాయి. అధికార డీఎంకే పట్ల వ్యతిరేకత అన్నా డీఎంకే నాయకత్వ లోపాలు తమకు కలసి వస్తాయని లెక్క వేసుకుంటోంది.
కనీసంగా ఆరు నుంచి ఎనిమిది దాకా ఎంపీ సీట్ల మీద బీజేపీ ఆశలు తమిళనాడులో ఉన్నాయి. అలాగే రాజస్థాన్ లోని 12 సీట్లకు తొలి విడతలో పోలింగ్ ఉంది. ఇక్కడ బీజేపీ మంచి ఊపు మీద ఉందని కమలనాధులు చెబుతున్నారు. మహారాష్ట్ర అసోం, ఉత్తరాఖండ్ లో అయిదేసి వంతున ఎంపీ సీట్లకు పోలింగ్ ఉంది. ఇక్కడ కూడా బీజేపీకి బాగానే ఆశలు ఉన్నాయి.
అలాగే ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇది బీజేపీకి కంచుకోట లాంటిది కాబటి తొలి బోణీ బాగుంటుంది అని విశ్వసిస్తోంది. బీహార్ లో నాలుగు. బెంగాల్ లో 3, అరుణాచలప్రదేశ్, మణిపూర్ మేఘాలయ లలో రెండేసి ఎంపీ సీట్లకు తొలి విడతలో పోలింగ్ ఉంది.
అలాగే చత్తీస్ ఘర్, నాగాలాండ్, మిజోరాం, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు. కాశ్మీర్ లక్ష ద్వీప్ పుదుచ్చేరీలలో ఒక్కో ఎంపీ సీటులో పోలింగ్ జరగనుంది. మొత్తంగా చూస్తే సగానికి పైగా సీట్లలో గెలుపు ఆశలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. దీంతో శుభారంభం పలుకుతామని కూడా అంచనా వేసుకుంటోంది. చూడాలి మరి పోలింగ్ ఏ విధంగా సాగుతుందో పోలింగ్ శాతం ఎలా నమోదు అవుతుందో జనాల ఉత్సాహం ఏ తీరున ఉందో అన్నది.