ఏపీలో హంగ్ కోసం బీజేపీ రాజకీయ వంటకం ...!?

రాజకీయాలలో పరమ పద సోపానాలుగా ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిలో కొన్ని జనాలు అందిస్తే మరికొన్ని అలా కుదిరిపోతాయి.

Update: 2024-01-29 04:49 GMT

రాజకీయాలలో పరమ పద సోపానాలుగా ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిలో కొన్ని జనాలు అందిస్తే మరికొన్ని అలా కుదిరిపోతాయి. కానీ కొన్ని మాత్రం రాజకీయ పార్టీలు తన వ్యూహరచనా చాతుర్యంతో తయారు చేయడానికి చూస్తారు. ఇపుడు అలాంటిదే చేయాలని కమలనాధులు తాపత్రయపడుతున్నారు. నిన్నటిదాకా తెలంగాణాలో హంగ్ రావాలని కలవరించిన బీజేపీకి అక్కడ అది సాధ్యపడలేదు.

కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ ఇస్తూ జనాలు ఓటేశారు. ఇపుడు ఏపీ వంతు వచ్చింది. ఏపీలో ఇప్పటికీ రాజకీయ అస్పష్టత ఉంది. అదెలా అంటే వైసీపీకి పూర్తి మద్దతు ఉందా అంటే తెలియడం లేదు. అలాగే టీడీపీకి అధికారంలోకి వచ్చేటంత శక్తి ఉందా అది కూడా తెలియని పరిస్థితి ఉంది. టీడీపీ పొత్తుల కోసం చూస్తోంది.

అన్ని పార్టీలు కలిస్తే వాటికి తలా కొన్ని సీట్లు ఇచ్చి మ్యాజిక్ ఫిగర్ ని సాధించేందుకు సరిపడా సీట్లు తాను తెచ్చుకుని మరో మారు అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తోంది. సరిగ్గా ఇక్కడే టీడీపీ వీక్ నెస్ ని పసిగట్టి సొమ్ము చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. అలాగే ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం నుంచి తమకు అనుకూలతను పెంచుకోవాలని అనుకుంటోంది.

అందుకే రిపీట్ 2014 అని బీజేపీ అనడంలేదు. 2024లో అద్భుతం సృష్టించాలని తాపత్రయపడుతోంది. ఇండియా కూటమి బీటలు వారడం ఆ కూటమికి వచ్చిన స్పందన అంతా నీటి బుడగ మాదిరిగా తేలిపోవడంతో బీజేపీకి కొత్త ఆశలు మొలుస్తున్నాయి. ఈసారి వై నాట్ 400 ఎంపీ సీట్లు అన్న నినాదానికి సౌండ్ పెంచుతోంది.

అదే విధంగా ఎన్నడూ అధికారంలోకి రాని చోట్ల వాటి కోసం ప్రయత్నం చేయడం అలాగే జెండా పాతని కేరళ వంటి రాష్ట్రాలలో బీజేపీ జెండా రెపరెపలాడించడం కూడా చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఏపీ అంటూ బీజేపీ వార్ రూం సరికొత్త యాక్షన్ ప్లాన్ ని డిజైన్ చేస్తోంది అని అంటున్నారు.

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కీలక జిల్లాలుగా గోదావరి జిల్లాలు ఉన్నాయి. అదే టైం లో బలమైన కాపు సామాజిక వర్గం కూడా తోడు కలవాల్సి ఉంది. ఇపుడు బీజేపీ వ్యూహకర్తలను ఈ రెండు అంశాలే ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఏపీలో బలంగా ఉన్న కాపులను తమ వెంట తెచ్చుకోవడంతో పాటు గోదావరి జిల్లాలలో కమల వికాసం జరిగితే ఏపీలో అధికారానికి తాము కూడా చేరువ కావచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడగా ఉంది.

అదేలా సాధ్యమంటే కాపులకు సీఎం పదవి కావాలి. అందుకే ఆ పోస్టు ఇస్తామని చెప్పి వారిని దగ్గరకు చేర్చుకోవడం అదే విధంగా పట్టు జట్టు విడవకుండా జనసేనతో కలసి ముందుకు అడుగులు వేయడం బీజేపీ చేయబోతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవిని ఏదో విధంగా ఒప్పించాలని చూస్తోంది. చిరంజీవిని బీజేపీ దిశగా మళ్ళించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.

మెగాస్టార్ కనుక రంగంలోకి దిగితే కేంద్రంలో బలంగా ఉన్న మోడీ బీజేపీ తోడు అయితే ఏపీలో కమల వికాసం కచ్చితంగా సాధ్యపడుతుంది అని అంటున్నారు. అంటే జనసేన బీజేపీ కూటమి సొంతంగా పోటీ చేస్తే కచ్చితంగా ముప్పయి నుంచి నలభై సీట్లు తెచ్చుకోగలరని ఒక అంచనాను ముందుకు తెస్తున్నారు.

అపుడు ఏపీలో కచ్చితంగా హంగ్ అసెంబ్లీ వస్తుంది. టీడీపీ వైసీపీలలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ 88కి సరిపడా సీట్లు రావు అని అంటున్నారు. ఆ టైంలో బీజేపీ అధికారంలో వాటా కోరుతూ టీడీపీ వైసీపీలతో బేరం ఆడేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో హంగ్ రావాలని బీజేపీ చూస్తోంది. ఇక కాపులకు సీఎం పదవి దక్కాలంటే హంగ్ రావాల్సిందే అన్న మాట కూడా పెద్దల నుంచి ఉంది.

అందుకే ముద్రగడ పద్మనాభం వంటి వారిని కూడా ఏరి కోరి బీజేపీ తన వైపునకు తిప్పుకుంటోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ విషయంలో బీజేపీ గతంలో ఎన్నడూ చూడని ఎత్తుగడలతో ముందుకు వస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.





 



Tags:    

Similar News