సూరత్ లో బీజేపీ బోణీ. ఎంపీ సీటు ఏకగ్రీవం
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రాజకీయ సంచలనం చోటు చేసుకుంది
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రాజకీయ సంచలనం చోటు చేసుకుంది. రెండో దశలో ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. అనూహ్యంగా ఇంకా ఎన్నికలు కూడా జరగకుండానే.. కీలకమైన వజ్రాల వ్యాపారానికి కేంద్రమైన సూరత్ నియోజకవర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా విజయం దక్కించుకుంది. ఇక్కడ నుంచి నామినేషన్ వేసిన బీజేపీ నాయకుడు ముఖేష్ దలాల్ విజయం దక్కించుకున్నారని ఎలక్టోరల్ అధికారులు ప్రకటించి సంబంధిత సర్టిఫికెట్ అందించారు. అయితే.. దీనిపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఏం జరిగింది?
సూరత్ అంటే.. ఒకప్పుడు దేశానికి మాత్రమే పరిమితమైనా.. ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా కనెక్ట్ అయింది. ప్రపంచ స్థాయిలో వజ్రాల వ్యాపారం ఇక్కడే జరుగుతోంది. ఇలాంటి నియోజకవర్గంలో పాగా వేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. కానీ, బీజేపీకి ఇది అత్యంత కీలకమైన నియోజకవర్గం. దీంతో ఆ పార్టీ కూడా అంతే పట్టుదలతో ఉంది. ఇక, నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత బీజేపీ నుంచి ముఖేష్ దలాల్, కాంగ్రెస్ పార్టీ నుంచి నీలేష్ కుంభానీ నామినేషన్ వేశారు. వీరితోపాటు.. మరో ఏడుగురు అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు.
అయితే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేష్ కుంభానీ సమర్పించిన రెండు సెట్ల నామినేషన్లలోనూ ఆయనకు మద్దతు ప్రకటించిన అభ్యర్థులు సంతకాలు తప్పుగా చేశారని.. పేర్కొంటూ.. రిటర్నింగ్ అధికారి .. రెండు సెట్ల నామినేషన్లనూ రద్దు చేశారు. దీంతో ఇక, బీజేపీ, ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో నిలిచారు. ఇక, నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం(ఏప్రిల్ 22)తో ముగిసింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నానానికి.. ఇండిపెండెంట్లను బీజేపీ లైన్‌లోకి పెట్టేసింది. దీంతో వారంతా గుండుగుత్తగా సోమవారం మధ్యాహ్నానికే తమ నామినేషన్లను ఉపసంహరించేసుకున్నారు. ఫలితంగా బీజేపీ అభ్యర్థి నామినేషన్ ఒక్కటే బరిలో ఉంది. దీంతో ఆయనను ఎన్నికలు కూడా పూర్తికాకుండానే ఆర్వో ఏకగ్రీవంగా ప్రకటించారు.
కొసమెరుపు: గత 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి రెండోసారి పోటీ చేసిన ప్రధాని మోడీ.. సమర్పించిన నామినేషన్లలో సంతకాలు కూడా తేడా వచ్చాయి. అప్పట్లో ఆయనకు ఈ సమాచారం చేరవేసి.. సంతకాలు సరిచేయించుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం సూరత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్తి నామినేషన్లను తిరస్కరించడం గమనార్హం.