బీజేపీతో టీడీపీ : ఇష్టమైన పొత్తా...కష్టమైనా తప్పని పొత్తా...!?

మాతో కలసి పనిచేసేందుకు వచ్చిన టీడీపీ జనసేనలకు ఆహ్వానం అని జేపీ నడ్డా అంటున్నారు.

Update: 2024-03-11 04:02 GMT

బీజేపీతో టీడీపీకి పొత్తు ఇష్టమైనదా లేక కష్టమైనదా ఇదే ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చగా సాగుతోంది. బీజేపీ వద్దు అనుకుంటే టీడీపీ వాళ్ళ వెంటబడి చేసుకున్న పొత్తు అని ప్రత్యర్ధులు అంటున్నారు. వారు అన్నారని కాదు కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఒక ప్రకటన చూసినా టీడీపీ తానుగానే వెళ్లి పొత్తు కుదుర్చుకుంది అన్న అర్ధం వస్తోంది.

మాతో కలసి పనిచేసేందుకు వచ్చిన టీడీపీ జనసేనలకు ఆహ్వానం అని జేపీ నడ్డా అంటున్నారు. అంటే చేసిన తప్పు తెలుసుకుని తిరిగి బీజేపీ తప్ప మరో పార్టీ లేదని శరణు వేడిన మీదటనే పొత్తు కుదిరిందా అన్నట్లుగా జేపీ నడ్డా మాటలను బట్టి కొత్త అర్ధాలు వెతుక్కోవాల్సి వస్తోంది.

ఇక బీజేపీ సైడ్ చూస్తే వారే అంతగా పొత్తు కోసం చూస్తే గత నెలలో బాబు అమిత్ షా భేటీ తరువాత మళ్లీ ఈ మధ్యన అంత ఎందుకు సైలెంట్ అయినట్లు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అది పక్కన పెట్టినా బాబు ఢిల్లీ వెళ్ళి మూడు రోజులు అక్కడ ఉన్న మీదట కానీ పొత్తు పొడవలేదు అంటే ఈ మధ్యలో సంథింగ్ సంథింగ్ నడచిందా అన్నదే ఒక ప్రచారంగా ఉంది.

వీటి మీదనే ఇపుడు అతి పెద్ద చర్చ సాగుతోంది. ఈ పొత్తు టీడీపీ వైపు నుంచి వచ్చింది కాబట్టే బీజేపీ బెట్టు చేసింది పైగా తన ఎంపీ సీట్లను ఆరు దాకా పెంచుకుంది అని అంటున్నారు. ఇక్కడే మరో ఉదాహరణను కూడా చూడాల్సి ఉంది. పక్కన పొరుగు రాష్ట్రంలో బీజేడీ ఉంది. బీజేపీ బీజేపీ పొత్తుల కోసం భేటీలు వేస్తున్నాయి.

అయితే బీజేపీ కోరుకునే ఎంపీ సీట్లు బీజేపీ ఇవ్వనని అంటోంది. అక్కడ పొత్తు ప్రతిపాదన కాస్తా ఆగింది. పైగా నవీన్ పట్నాయక్ ఢిల్లీ వెళ్లలేదు. బీజేపీ దూతలే ఒడిషా వచ్చారు. అంటే బీజేపీ పొత్తు కావాలని అనుకుంటే వారే ఆయా రాష్ట్రాలకు వెళ్ళి కుదుర్చుకుంటారు అన్న మాట. మరి ఏపీలో అలా జరిగిందా.

ఇపుడు కాదు 2014, 2004లో అయినా అలా జరిగిందా అంటే లేదు అనే జవాబు వస్తుంది. అందుకే వైసీపీ లాంటి పార్టీలు బాబే పొత్తుల కోసం ఢిల్లీ వెళ్లారు, కేంద్ర పెద్దల ముందుకు వెళ్ళి కూటమి కట్టారు అని సెటైర్లు వేస్తున్నారు.

ఇవన్నీ కూడా పక్కన పెట్టినా బీజేపీతో పొత్తు అంటే టీడీపీ ఎగిరి గంతు వేయాలి కదా మీడియా ముందుకు రావాలి కదా. అసలే బాబు ప్రతీ చిన్న విషయం మీడియాతో పంచుకుంటారు. అలాంటిది తాము సాధించామని అనుకున్నది గొప్పగా చెప్పుకోవడానికి అయినా మీడియా ముందుకు రావాలి కదా.

మరి బాబు రాలేదు అంటే బీజేపీ పొత్తు కంటే ఆ పార్టీ పెట్టిన కండిషన్లే ఎక్కువ భారంగా మారాయా అన్న సందేహాలు కూడా వస్తున్నాయట. ఏదో విధంగా పొత్తు పెట్టుకుని రేపటి ఎన్నికల్లో గెలిచినా బీజేపీ వ్యూహాలు ఏపీలో వర్కౌట్ అవుతాయని కూడా అంటున్నారు ఒక వేళ ఓడితే ఆ తరువాత చెప్పాల్సింది లేనే లేదని అంటున్నారు.

మొత్తానికి బీజేపీ భారీ కండిషన్లు పెట్టే ఈ పొత్తుకు ఒప్పుకుంది అన్నది అయితే పొలిటికల్ సర్కిల్స్ లో కానీ మీడియా సర్కిల్స్ లో కానీ జరుగుతున్న ప్రచారం. మరి ఆ కండిషన్లు ఏమిటి అన్నది ఈ రోజు తెలియదు కానీ ఏ రోజు అయినా బయటకు వస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News