ఎంపీ టికెట్ల కోసం ప్యారాచూట్ నేతలు

తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయటానికి చాలామంది పోటీ పడుతున్నారు.

Update: 2024-01-15 10:18 GMT

తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయటానికి చాలామంది పోటీ పడుతున్నారు. పోటీపడుతున్నవారంతా పార్టీలోని సీనియర్ నేతలే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. టికెట్ల కోసం పోటీపడుతున్న వారిలో సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులున్నారు. వీళ్ళకి పార్టీతో ఎలాంటి సంబంధంలేదు. వీళ్ళేమీ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళూ కాదు. అయినా సరే టికెట్లు తెచ్చుకునేందుకు లాబీయింగులు మొదలుపెట్టేశారట. కారణం ఏమిటంటే కేంద్రంలో మళ్ళీ ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని, నరేంద్రమోడీయే ప్రధానమంత్రి అవుతారన్న ఆశ.

ఒకసారి ఎంపీగా గెలిస్తే చాలా లాభాలు ఉంటాయని చాలామంది అనుకుంటున్నారు. అందుకనే బీజేపీ టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల పార్టీకి సిట్టింగ్ ఎంపీలే ఉన్నారు. మిగిలిన 13 నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేయాల్సుంటుంది. అయితే విచిత్రం ఏమిటంటే పై నాలుగు సీట్లలో ఒకటైన కరీంనగర్ ఎంపీ సీటులో పోటీచేయటానికి కూడా ప్యారాచూట్ ఆశావహులు రెడీ అవుతున్నారట.

మల్కాజ్ గిరి నుండి పోటీచేయటానికి ఢిపీఎస్, పల్లవి ఎడ్యుకేషనల్ గ్రూప్ ఛైర్మన్ కొమరయ్య గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు. తన ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే కేంద్రంలోని పెద్దలను కూడా కలిశారు. ఇక జహీరాబాద్ పార్లమెంటులో పోటీచేయటానికి క్యాసినో కింగ్ గా పాపులరైన చికోటి ప్రవీణ్ కుమార్ బాగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్ ఉన్నప్పటికీ తనకు టికెట్ కావాలని యూప్ టీవీ సీఈవో ఉదయ్ నందన్ రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారట.

నల్గొండ పార్లమెంటుకు పోటీచేయటానికి ఎన్ఆర్ఐ మన్నె రంజిత్ యాదవ్ గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ పార్లమెంటులో పోటీచేయటానికి విరించి ఆసుపత్రి ఛైర్ పర్సన్ డాక్టర్ మాధవీలత బాగా ఆసక్తితో ఉన్నారు. ఓల్డ్ సిటీలోని కొన్ని ఏరియాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తు పాపులారిటి సంపాదించుకుంటున్నారు. ఇక వరంగల్ సీటు నుండి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్) అధ్యక్షుడు కృష్ణమాదిగ పేరు బాగా వినబడుతోంది. జహీరాబాద్ నుండి పోటీచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు బిచ్ముంద మఠాధిపతి సోమయప్పస్వామి ఇప్పటికే ప్రకటించారు. ఆదిలాబాద్ టికెట్ కోసం సినీనటుడు అభినవ్ కేతావత్ తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఎన్నికలంటేనే ప్యారాచూట్ ఆశావహుల హడావుడి ఎక్కువపోతుందంతే.

Tags:    

Similar News