ఇలా కూడా ఓట్లు వేయించుకుంటారా? : బీజేపీ గుట్టు బయట పెట్టిన కాంగ్రెస్
అక్కడి అధికార పార్టీ బీజేపీకి ఓటు వేసినట్లు ప్రమాణం చేయకపోతే, తమకు బోర్‌వెల్ నుండి నీళ్లు అందించేది లేదని.. తన నియోజకవర్గం అభ్యర్థి హెచ్చరించినట్టు ముంగవాలి గ్రామీణ మహిళలు ఆరోపించారు.
ఎన్నికలు అనగానే.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కామనే. ఇది దాదాపు అన్ని పార్టీలూ చేస్తున్న తంతుగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. అందుకే తాము ఆయా రాష్ట్రాల్లో నిఘాను ముమ్మరం చేశామని కూడా చెప్పుకొచ్చంది. ఇక, ప్రలోభాలు అంటే.. దీనికి ఒకపరిమితి లేదు. డబ్బులు, నగలు(తక్కువ మొత్తంలో), ఎలక్ట్రానిక్‌పరికరాలు, గోడగడియారాలు.. ఇలా.. అనేక వస్తువులు ప్రలోభాల జాబితాలో ఉంటాయి. ఉన్నాయికూడా. వీటిని చూపించి.. మనోడికి ఓటేయండనే సంస్కృతి గత రెండు మూడు దశాబ్దాలుగా ఈ దేశంలో జరుగుతోంది.
అయితే.. ఈ ప్రలోభాలకు తోడు.. బెదిరింపు రాజకీయాలు కూడా తెరమీదకి వచ్చాయి. "మీ వాడలో రోడ్డు కావాలా? అయితే.. మా పార్టీ అభ్యర్థికే ఓటేస్తామని ఒట్టు పెట్టండి. మీ పిల్లలపై ప్రమాణం చేయండి" అనే కొత్త సంస్కృతి వెలుగు చూసింది. అంతేకాదు.. ఓటర్లను బెదిరించి మరీ ప్రమాణం చేయించిన ఘటన తాజాగా ఎన్నికల సంఘానికి చేరింది.దీనిని కాంగ్రెస్ పార్టీనే బట్టబయలు చేయడం గమనార్హం. దీంతో సదరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనిపై ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూడాలి.
ఏం జరిగిందంటే..
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17న మధ్యప్రదేశ్‌లో అసెంబ్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇంతలోనే బాంబు లాంటి విషయం బయటకు పొక్కింది. అక్కడి అధికార పార్టీ బీజేపీకి ఓటు వేసినట్లు ప్రమాణం చేయకపోతే, తమకు బోర్‌వెల్ నుండి నీళ్లు అందించేది లేదని.. తన నియోజకవర్గం అభ్యర్థి హెచ్చరించినట్టు ముంగవాలి గ్రామీణ మహిళలు ఆరోపించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ బయటకు తీసుకువచ్చింది.
రాష్ట్ర మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ ప్రాథనిథ్యం వహిస్తున్న ముంగవాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయఖేడ గ్రామం నుండి ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. గతంలో బీజేపీకి ఓటు వెయ్యలేదనే అక్కసుతో తాగేనీళ్లు కూడా ఇవ్వడం లేదని మహిళలు తీవ్ర మనోవేదన చెందారు. ఇలాగైతే తామెలా బతకాలని, అందుకే బ్రిజేంద్ర సింగ్ మద్దతుదారులు చేయమన్న ప్రమాణం చేశామని.. ఆయనకే ఓటు వేశామని.. చెప్పుకొచ్చారు. బీజేపీకి ఓటు వేశారా? లేదా? అని ఆ పార్టీ వాళ్లు అడుగుతున్నారని.. ఒకవేళ వేయలేదని చెప్తే, మోటార్ స్విచ్ ఆఫ్ చేసి తమని తమిరికొడుతున్నారని శ్యామ్ బాయి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. చివరకు ఇక్కడ తిరిగి పోలింగ్ నిర్వహించాలనే వరకు విషయం వెళ్లింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.