కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్ర పూజల కలకలం!

కాగా, ఇప్పుడు నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్రపూజల కలకలం రేగింది. అలాంటి ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-04-16 10:46 GMT

అధికారం కోల్పోయి.. నాయకులు వెళ్లిపోతూ.. కుమార్తె అరెస్టయి.. స్వయంగా గాయపడి.. లోక్ సభ ఎన్నికల వంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది బీఆర్ఎస్. ఉద్యమ పార్టీగా 14 ఏళ్లు మనుగడ సాగించి.. పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం చూసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలోనూ పట్టు సడలకుండా అధినేత కేసీఆర్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. పంటలు ఎండిపోతుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిశీలనకు వెళ్లారు. చేవెళ్లలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇటీవల నాయకులనూ కలుస్తున్నారు.

ఫాంహౌస్ నుంచి నందినగర్ కు సీఎంగా ఉన్న సమయంలో ప్రగతిభవన్- ఫాంహౌస్ కు తరచూ రాకపోకలు సాగించే కేసీఆర్.. అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ ఉండాలనే సమస్యను ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం నేరుగా ఫాం హౌస్ కు వెళ్లిపోయిన ఆయన అక్కడ గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. వైద్య అవసరాల రీత్యా ఆయన ఫాంహౌస్ కు వెళ్లేలేని పరిస్థతి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నందినగర్ లోని పాత ఇంటికి మారారు.

ఉద్యమ కాలం నాటి ఇల్లు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నందినగర్ లోని ఇంట్లోనే ఉండేవారు. అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం వైఎస్ నిర్మించిన బంగళాలోకి మారారు. అనంతరం దాని స్థానంలో ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. కాగా, ఇప్పుడు నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్రపూజల కలకలం రేగింది. అలాంటి ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఖాళీ స్థలంలో క్షుద్రపూజలు జరిగినట్లు చెబుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా క్షుద్రపూజలు చేసిందెవరో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చేశారు ? ఎప్పుడు చేశారు ? ఎవరు చేయించారు ? ఎవరి కోసం చేశారు ? నిత్యం సెక్యూరిటీ ఉండే.. కేసీఆర్ ఇంటిపక్కనే.. అందులోనూ హైదరాబాద్ లో క్షుద్రపూజలు చేయడం ఎలా సాధ్యమైంది ? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, క్షుద్రపూజల ఆనవాళ్లు చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

కాగా, కేసీఆర్ కు దైవ భక్తి చాలా ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. సీఎంగా ఉన్నప్పుడు తన ఫాం హౌస్ లో ఆయన అయుత చండీ యాగం నిర్వహించారు. అనంతరం కూడా యాగాలు చేశారు. యాదగిరి గుట్ట ఆలయాన్ని పునర్ నిర్మించి యాదాద్రిగా పేరు మార్చారు. విజయవాడ కనకదుర్గకూ కానుకలు పంపారు. ఇంకా అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


Full View


Tags:    

Similar News