బోయింగ్ విమానాలకు ఏమైంది? ఈసారి ఇంజిన్ కవర్ ఊడింది

విమానాల తయారీలో అత్యంత విశ్వసనీయమైన సంస్థగా.. దిగ్గజ సంస్థగా పేరున్న బోయింగ్ కు ఈ మధ్యన ఏమైంది

Update: 2024-04-09 07:23 GMT

విమానాల తయారీలో అత్యంత విశ్వసనీయమైన సంస్థగా.. దిగ్గజ సంస్థగా పేరున్న బోయింగ్ కు ఈ మధ్యన ఏమైంది. తరచూ ఏదో ఒక వివాదంలో ఈ విమాన తయారీ సంస్థ పేరు తరచూ వినిపిస్తోంది. తాజాగా మరో ప్రమాదానికి బోయింగ్ విమానం గురైంది. లక్కీగా ఎవరికి ఏమీ కాలేదు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బోయింగ్ విమానం అంటేనే భయపడేలాంటి పరిస్థితుల్లోకి వస్తున్న పరిస్థితి.

విమానాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బోయింగ్ సంస్థకు ఈ మధ్య కాలం కలిసి రావటం లేదు. తరచూ ఏదో ఒక ప్రమాదానికి గురవుతున్నాయి బోయింగ్ విమానాలు. అంతేనా.. ఇటీవల ఆ సంస్థ తయారుచేసిన 737 మాక్స్ రకం విమానం తరచూ ప్రమాదాలకు గురి కావటం తెలిసిందే. 2018, 2019లో రెండు 737 మాక్స్ విమానాలు కూలిన ఉదంతాల్లో మొత్తం 346 మంది మరణించారు.

ఈ నేపథ్యంలో 18 నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆ మోడల్ విమానాల్ని ఎగరనివ్వకుండా నిలిపివేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి నుంచి ఈ విమానాలు ఏదో ఒక ప్రమాదం పేరుతో వార్తల్లోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన బోయింగ్ 737-800 రకం విమానం టేకాఫ్ అయ్యే వేళలో ఇంజిన్ పై భాగంలో ఉండే కవర్ ఊడిపోయి ఎగిరిపోయింది.

ఈ సందర్భంగా వచ్చిన శబ్ధానికి ప్రయాణికులు వణికిపోయారు. పెద్దగా కేకలు వేస్తూ విమాన సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో పైలెట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి.. వెంటనే విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లైట్ ఇంజిన్ కవర్ గాలికి ఉడి.. ఎగిరిపోయిన వైనాన్ని వీడియో తీశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఇటీవల కాలంలో బోయింగ్ విమానాలు తరచూ ప్రమాదాలకు గురి అవుతున్నాయి. అదెంత ఎక్కువగా అంటే.. 2024లోని మొదటి మూడు నెలలు ముగిసే నాటికి బోయింగ్ కు చెందిన విమానాలకు సంబంధించి మొత్తం 29 ప్రమాదాలు జరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. దీంతో.. బోయింగ్ విమానాల్లో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకుంది.

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్సు వన్ విమానాన్ని తయారుచేసింది కూడా బోయింగే. ఈమధ్యన అమెరికా అధ్యక్షుడు బైడెన్ బోయింగ్ మీద వ్యంగ్య వ్యాఖ్య చేశారు. తాను ఎయిర్ ఫోర్సు వన్ విమానంలో ప్రయాణించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తలుపు పక్కన కూర్చోనని వ్యాఖ్యానించారు. ఆ మధ్యన బోయింగ్ విమానం డోర్ ఊడిపోయిన ఉదంతం తెలిసిందే.

Tags:    

Similar News