వీడియో వైరల్.. గాల్లో విమానం.. ఊడిన టైరు!
అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది
అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే అది గాల్లో ఉండగా దాని టైరు ఊడిపడిపోయింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే దారిమళ్లించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777–200 విమానం అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్ లోని ఒసాకా నగరానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఈ క్రమంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం వెనుక వైపున ల్యాండింగ్ గేర్ లోని ఓ టైరు ఊడిపడిపోయింది. అది విమానాశ్రయంలోని పార్కింగులో ఉన్న కారుపై బలంగా పడింది. దీంతో ఆ వాహనం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
టైరు ఊడిన విషయాన్ని వెంటనే గుర్తించిన పైలట్లు విమానాన్ని దారిమళ్లించి లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా సురక్షితంగా దింపారు. అందులోని ప్రయాణికులను మరో విమానంలో జపాన్ కు పంపారు.
కాగా బోయింగ్ 777 విమానాల్లో రెండు ల్యాండింగ్ గేర్ లకు ఆరు చొప్పున టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్ ను రూపొందించారు. టైరు ఊడిపోయిన ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కాగా విమానం నుంచి టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అలాగే టైరు పడటం వల్ల దెబ్బతిన్న కారు ఫొటోలు వైరల్ గా మారాయి.