నేతగా ఫ్యూచర్ కోసమే అలా తిట్టేశా.. పోలీసు విచారణలో బోరుగడ్డ అనిల్!

ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నుంచి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన అనిల్ ను ఈ మధ్యనే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

Update: 2024-10-18 04:12 GMT

వెనుకా ముందు చూసుకోకుండా.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం.. ఆన్ లైన్ వేదికగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఫేమస్ గా మారిన బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు.. వైసీపీ యేతర నేతలపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. అనుచిత వ్యాఖ్యలు చేయటం.. రాయలేనంతగా మాటలు అనేయటం లాంటివి బోరుగడ్డ అనిల్ కు ఎక్కువే. అతడిపై బోలెడు కేసులు నమోదై ఉన్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నుంచి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన అనిల్ ను ఈ మధ్యనే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

తాజాగా కోర్టు ఎదుట హాజరుపర్చగా.. అతడికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కోర్టుకు హాజరుపర్చటానికి ముందు దాదాపు రెండు గంటల పాటు గుంటూరు అరండల్ పేటల డీఎస్పీ జయరాం ప్రసాద్ తో పాటు.. మరికొందరు పోలీసుల సమక్షంలో అనిల్ ను విచారించినట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష నేతను మొదలుకొని మహిళా నేతల్ని ఇష్టారాజ్యంగా ఎందుకు తిట్టావు? నీ వెనుక ఎవరున్నారు? ఎవరు చెబితే ఇదంతా చేశావు? ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడకు వెళ్లావు? ఎవరు నీకు ఆశ్రయం ఇచ్చారు? లాంటి పలు ప్రశ్నల్ని సంధించినట్లుగా తెలుసతోంది.

ఈ ప్రశ్నల్లో కొన్నింటికి అనిల్ సమాధానమిస్తూ.. కొందరు వైసీపీ నేతల ఒత్తిడి.. ప్రోద్బలంతోనే తాను అప్పట్లో అలా వ్యవహరించినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. వారి పేర్లను వెల్లడించలేదని తెలుస్తోంది. కొందరు వైసీపీ నేతల మాటల్నినమ్మి తాను దూకుడుగా వ్యవహరించినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. ఇకపై అలాంటి తప్పు చేయనని వాపోయినట్లుగా తెలుస్తోంది. నీ వెనుక ఉన్న వైసీపీ నేత ఎవరు? అని పదే పదే ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని సమాచారం.

వైసీపీ జిల్లాఅధ్యక్షుడు ఒకరు తనకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పారని.. ఇప్పుడు ఆ నేత పార్టీ మారారని.. తనను పట్టించుకోవటం మానేసినట్లుగా వెల్లడించినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోన వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 20 కేసులు నమోదై ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కేసులు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తాజా అరెస్టు నేపథ్యంలో అతనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపినట్లుగా తెలుస్తోంది. ఇంతకూ అనిల్ ను మాంచి ఫ్యూచర్ ఉందని ప్రోత్సహించిన సదరు వైసీపీ నేత ఎవరు? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News