ఆ రెండు వాతావరణాలు చల్ల బడేది జూన్ 4నే
అదే సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల ఆగమనంతో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు నిప్పుల కొలిమిలా ఎండాకాలపు సెగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలతో రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే రేపు కౌంటింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ వేడి దాదాపుగా చల్లారే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల ఆగమనంతో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
తొలకరి వర్షాలు మొదలైతే ఏపీ, తెలంగాణలోని రైతులు కూడా తమ పొలం పనుల్లో బిజీ అవుతారు. తద్వారా రాజకీయపరమైన విషయాలకు, గొడవలరే దాదాపుగా దూరంగా ఉంటారు. జూన్ 4వ తేదీతో గత 4 నెలలుగా దేశంలో ఉన్న రాజకీయ వేడితో పాటు వాతావరణంలో ఉన్న వేడి కూడా ఒకేసారి చల్లారనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధవాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అదే స్థాయిలో ఆయా పార్టీల కార్యకర్తలు కూడా మాటల యుద్ధంతో పాటు పరస్పర దాడులకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే వర్షాలు మొదలయితే పంటల సాగు వంటి విషయాలపై గ్రామీణ ప్రాంత ప్రజల దృష్టి సారించి ఎన్నికల గొడవలకు దూరంగా వెళ్లే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొందరు మినహాయిస్తే మెజారిటీ ప్రజలు ఎన్నికల ఫలితాలు, వర్షాలు మొదలైన తర్వాత పొలం పనులలో బిజీ అవుతుంటారు. ఏదేమైనా ఒక పక్క రుతుపవనాల రాక, మరోపక్క ఎన్నికల కౌంటింగ్ తేదీ ఒకేసారి రావడంతో ఇటు రాజకీయ వాతావరణం, అటు మామూలు వాతావరణం చల్లబడ్డాయని చెప్పవచ్చు.