అధికారంలో లేనోళ్లం.. ఏంటి సేత్తాం.. బొత్స మార్క్ మాట

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవలో ఉన్న వారెవరైనా కష్టంలో ప్రజలు ఉన్నారన్నంతనే ఉరుకులు పరుగులు మీద బయటకు రావాల్సి ఉంది.

Update: 2024-09-05 04:52 GMT

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవలో ఉన్న వారెవరైనా కష్టంలో ప్రజలు ఉన్నారన్నంతనే ఉరుకులు పరుగులు మీద బయటకు రావాల్సి ఉంది. బాధితుల వద్దకు వెళ్లాల్సి ఉంది. అన్ని సందర్భాల్లోనూ సాయం అంటే ధన సాయం.. వస్తు సాయం మాత్రమే కాదు.. మాట సహాయం కూడా ఉంటుందన్న చిన్న విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోతున్నారు. వరదలు విరుచుకుపడి.. విజయవాడ ఆగమాగం అయిన వేళలో అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వారు లక్షలాదిగా ఉన్నారు ఇలాంటి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించటానికి ముందుకు రావాల్సి ఉంది.

కానీ.. విపక్ష వైసీపీ నేతలు మాత్రం బయటకు రాలేదు. తమ పార్టీ అధినేత బయటకు వచ్చేసి.. పర్యటిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇలా వస్తున్న వారికి బాధితుల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. అలాంటి బాధితుల్లో సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు భారీ నిరసన సెగ తగిలింది.

వరదలతో ఇళ్లు మునిగిన వారిని పరామర్శించేందుకు వచ్చిన బొత్సను చూసిన మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘‘ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకు వచ్చారు?’’ అంటూ బొత్సను మహిళలు నిలదీశారు. దీంతో ఆయన సమాధానం చెప్పలేక తడబడ్డారు. ఇదే సమయంలో మరికొందరు బాధితులు.. ఏం సాయం చేశారంటూ ప్రశ్నించారు. దీనికి చిరాకు పడిన బొత్స.. ‘‘అధికారంలో లేనోళ్లం ఏటి సేత్తాం’’ అంటూ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తనను అదే పనిగా నిలదీస్తున్న మహిళలకు సమాధానం చెప్పలేని బొత్స వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

మరో ఉదంతంలో..వైసీపీ నేతలపై బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పునరావాస కేంద్రానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ కు అనూహ్య పరాభవం ఎదురైంది. బాధితుల వద్దకు వెళ్లిన ఆయన్ను.. అక్కడి వారు తీవ్రంగా నిలదీశారు. మూడు రోజులుగా పట్టించుకోకుండా ఇపుడు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. అధికార పక్ష కూటమి నేతలు మూడు రోజులుగా పునరావాస కేంద్రంలో కూటమి నేతల వచ్చి తమను ఆదుకుంటున్నారని.. తీరిగ్గా మూడు రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు రాజకీయాలు మొదలు పెడతారా? అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరాభవాలు వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు.

Tags:    

Similar News