కేర్ వర్కర్లకు బ్రిటన్ లో సరికొత్త హెచ్చరికలు ఇవే!
ఈ క్రమంలో తీసుకువచ్చిన ఈ కొత్త విధానాన్ని ఈ వారం నుంచే అమలుచేసే అవకాశం ఉందని బ్రిటన్ హోం శాఖ మంత్రి వెలడించారు.
ఇంటిపనుల్లో సాయపడే కేర్ వర్కర్ల విషయంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. భారతీయులతో సహా ఓవర్సీస్ కేర్ వర్కర్లు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను వెంట తీసుకురావడానికి వీల్లేందని బ్రిటన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో తీసుకువచ్చిన ఈ కొత్త విధానాన్ని ఈ వారం నుంచే అమలుచేసే అవకాశం ఉందని బ్రిటన్ హోం శాఖ మంత్రి వెలడించారు.
అవును... ఈవారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త వీసా నిబంధనల ప్రకారం... భారతీయులతో సహా ఓవర్సీస్ కేర్ వర్కర్లు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను యూకే తీసుకురాకుండా నియంత్రణ విధిస్తూ అక్కడి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్రిటన్ హోంశాఖ మంత్రి జేమ్స్ క్లెవెర్లీ ఈ నూతన వలస విధానానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఇందులో భాగంగా కేర్ వీసా విధానం ద్వారా గత ఏడాదిలో 1,00,000 వీసాలకు బ్రిటన్ అనుమతించగా.. వారి వెంట మరో 1,20,000 మంది డిపెండెంట్ లు వచ్చారని.. ఇది వీసా దుర్గినియోగం విషయంలో తాము తీసుకుంటున్న చర్యలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందన్ని.. ఇకపై ఇలాంటి పరిస్థితిని అనుమతించబోమని అన్నారు.
ఇదే సమయంలో కేర్ వర్కర్లు తమ సమాజానికి అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారని.. అవసరమైన సమయాల్లో తమ ప్రియమైనవారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని తెలిపిన జేమ్స్ క్లెవెర్లీ... అయితే ఈ దుర్వినియోగాన్ని మాత్రం సమర్థించలేమని అన్నారు. ఈ పనులు తమ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పూర్తిగా తారుమారు చేస్తుందని తెలిపారు. ఈ ఆమోదయోగ్యం కాని పరిస్థితిని కొనసాగించడాన్ని అనుమతించడం సరైంది కాదని స్పష్టం చేశారు.
ఈ మేరకు గురువారం పార్లమెంట్ లో ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ సమయంలో వలసదారుల కోసం స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నవారు ఇంగ్లాండ్ లోని కేర్ ప్రొవైడర్లు కూడా కేర్ క్వాలిటీ కమిషన్ లో నమోదు చేసుకోవలని ప్రభుత్వం పేర్కొంది.