'హైడ్రా' పై మరో రగడ.. కోర్టు ఏం చెప్పిందంటే!
అయితే.. దీనిని సవాల్ చేస్తూ.. బీఆర్ ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రా వ్యవహారం మరోసారి రగడకు దారి తీసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం.. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ.. ఆర్డినెన్స్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ విష్ణుదేవ్ శర్మ ఆమోద ముద్ర కూడా వేశారు. ప్రస్తుతం హైడ్రా దూకుడుకు ప్రభుత్వం మరిన్ని పగ్గాలు అప్పగించినట్టు అయింది. అయితే.. దీనిని సవాల్ చేస్తూ.. బీఆర్ ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిని విచారణకు తీసుకున్న ధర్మాసనం.. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకుంది.
పిటిషన్ వాదనలు ఇవీ..
హైడ్రా అనేది రాజకీయ దురుద్దేశంతో తీసుకువచ్చిన వ్యవస్థగా మంచి రెడ్డి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనివల్ల అనేక మంది రోడ్డు పాలవుతున్నారని తెలిపారు. అదేసమయంలో సీఎం రేవంత్ సోదరుడి ఇంటిని మాత్రం హైడ్రా అధికారులు ముట్టుకోలేదని .. దీనిని బట్టి రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లను, భవనాలను, ఆస్తులను కూల్చేందుకు దీనిని వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యానికి తోడు.. హైడ్రాకు మరిన్ని విస్తృత అధికారాలు కల్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే హైడ్రా దూకుడుగా ఉందని.. సామాన్యులను వేధిస్తోందని.. ఈ నేపథ్యంలో విస్తృత అధికారాలు సరికాదన్నారు.
గవర్నర్ ఆమోదం పొందిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దు చేయాలని.. ఈ మేరకు హైకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయని మంచి రెడ్డి తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసును అప్పటి వరకు వాయిదా వేసింది. అయితే.. గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక, ప్రతివాదులుగా ఉన్న వారిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ ఆలోచన ఏంటి?
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన వేరుగా ఉంది. హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్న సంకల్పంతో ఉంది. ఈ క్రమంలోనే మూసీ నదిని ఆనుకుని నిర్మించిన కట్టడాలు, ఆక్రమణలను తొలగించాలన్న సంకల్పంతో ఉండడం గమనార్హం. దీనిలో భాగంగానే ఈ ఏడాది జూలైలో హైడ్రాను తీసుకువచ్చింది. అయితే.. రాజకీయ పరమైన వివాదాలు, విమర్శలు హైడ్రాను చుట్టుముట్టాయి. అయినా.. సీఎం రేవంత్ రెడ్డి వెరవకుండా.. ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని అదికారాలు కల్పిస్తూ.. తాజాగా ఆర్డినెన్స్ తెచ్చారు. దీనిని శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించనున్నారు.