బీఆర్ ఎస్‌లో టికెట్ల ఎఫెక్ట్.. కీలక నేత `చే`జారుతున్నారే!
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్‌లో వచ్చే ఎన్నికలకు సంబందించి.. టికెట్ల రగడ మామూలుగా లేదా? నేతల అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసి పడుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్‌లో వచ్చే ఎన్నికలకు సంబందించి.. టికెట్ల రగడ మామూలుగా లేదా? నేతల అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసి పడుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా మారిన, మారుతున్నపరిణామాలు ఈ విషయాన్నే తేల్చి చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి టికెట్‌దక్కించుకుని గెలుపుగుర్రం ఎక్కాలని భావించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నేత, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిపోయేందుకు ముహూర్తం రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా కృష్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో బీఆర్ ఎస్‌తో `తీగ`ల బంధం తెగిపోతోందని అంటున్నా రు పరిశీలకులు. గతంలో టీడీపీలో ఉన్న తీగల.. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటి టీఆర్ ఎస్‌లో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు గత 2018 ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ ఇచ్చారు. అయితే.. కాంగ్రెస్ నాయకురాలు, ప్రస్తుతం బీఆర్ ఎస్ నేత, మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయారు. కానీ, తర్వాత జరిగిన పరిణామాల్లో సబితా రెడ్డి.. వ్యూహం మార్చుకుని కేసీఆర్కు జై కొట్టారు. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి.. బీఆర్ ఎస్‌లో చేరి మంత్రి కూడా అయ్యారు.
ఇక, అప్పటి నుంచి కూడా తీగలకు టికెట్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అయినప్పటికీ.. కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆయన తనకు తప్ప టికెట్ ఇంకెవరికిస్తారనే ప్రచారం చేసుకున్నారు. పైగా ఆయన కోడలు కూడా మహేశ్వరం జెడ్పీటీసీగానే ఉన్నారు. అంటే.. ఒకరకంగా బీఆర్ ఎస్‌తో కుటుంబ సభ్యులు కూడా కలిసి ఉన్నారు. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనదే టికెట్ అనుకున్నారు. కానీ, తాజాగా రెడీ అవుతున్న టికెట్ల జాబితాలో తన పేరులేదనే సమాచారం తీగలకు తెలిసిపోయిందనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో చేతులు కాలకముందే.. చక్కదిద్దుకోవాలని భావించిన తీగల కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రేవంత్తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మహేశ్వరం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బలమైన కాంగ్రెస్ కంచుకోటలో తన గెలుపుపై తీగల ధీమాతోనే ఉండడం.. నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కేడర్ బలంగా ఉండడం వంటివి ఆయనకు కలిసి వచ్చే అవకాశాలని ఆయన వర్గం చెబుతోంది. మొత్తానికి బీఆర్ ఎస్‌లో టికెట్ల రగడ.. కీలకనేతలను పక్కదారులు పట్టిస్తుండడం గమనార్హం.