కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్ అధికారం చేపట్టడం అంత ఈజీనా?
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
కేసీఆర్ అంటే తెలంగాణకు ఓ బ్రాండ్. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన కృషి, పోరాట పటిమ అంతాఇంతా కాదు. ఒకవిధంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెప్పొచ్చు. ఎన్నో దీక్షలు.. ఎన్నో సభలు.. మరెన్నో సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఆవశ్యకతను ఊరూరా చాటి చెప్పారు. చివరకు లక్ష్యాన్ని సాధించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రజలు సైతం కేసీఆర్ మీద నమ్మకంతో ఆయననే సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఒక్కసారి కాదు రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టారు. 2014, 2018లో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు. దశాబ్దకాలం పాటు రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో అయినా ఆ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రంలో ఇతర పార్టీ అనేది కనిపించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది.
అంత వరకు బాగానే ఉన్నా.. ఏ నినాదంతో అయితే రాష్ట్రం ఏర్పాటు జరిగిందో వాటిలో కేసీఆర్ నెరవేర్చింది ఏంటో తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలిసిందే..! నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. లక్ష కోట్లతో ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. వాటితోపాటే మరికొన్ని ప్రాజెక్టులను నిర్మించారు. తెలంగాణ మొత్తానికి సాగు నీరు అందించడమే లక్ష్యంగా వాటి నిర్మాణానికి పూనుకున్నారు.
అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఐమేజీకి పెద్ద డ్యామేజీని తీసుకొచ్చిందనే చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. దాంతో ప్రాజెక్టు నిర్మాణంలోని వైఫల్యాలు వెలుగుచూశాయి. దాంతో ప్రజల్లోనూ మెలమెల్లగా ఆయనపై విశ్వాసం తగ్గింది. ఫైనల్లీ మొదటి సారి కేసీఆర్ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
2023 నవంబర్ నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. పీసీసీ చీఫ్‌గా ప్రచారంలో దూకుడుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలు అవుతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచే బీఆర్ఎస్ వైఫల్యాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఓటమి నుంచి కేసీఆర్ సైతం సైలెంటుగానే ఉండిపోయారు. ఇటీవల తన కూతురు కవిత జైలు నుంచి విడుదల కావడంతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారని.. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలే అంటూ ఆ పార్టీ నేతలు గొప్పలకు పోతున్నారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కాస్త నెట్టింటా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజలు ఎంతగానో ఆదరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే దానిని కూల్చడం అంత ఈజీనా..? ప్రజలు తిరస్కరిస్తేనే అధికారం కోల్పోయిన కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు బీఆర్ఎస్ నేతలకే తెలియాలి మరి!! ఇప్పటికే ఎన్నో అవినీతి, అక్రమాల విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు ఆ ఉచ్చు నుంచి ఎలా బయటపడుతారు..? వాటన్నింటిని పట్టించుకోకుండా మళ్లీ అధికారం చేపడుతామంటూ ప్రచారం సాగించడం ఏంటి..? కవిత జైలు నుంచి వచ్చినందుకు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వస్తుండడం మంచి పరిణామమే అయినప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతుండడం మాత్రం అది ఆయన మైలేజీకే మైనస్ అవుతుందని పలువురు రాజకీయ నిపుణుల అభిప్రాయం.