బీఆర్ఎస్‌కు కొత్త నాయకత్వం అవసరమా..? కేడర్ అదే కోరుకుంటున్నదా..?

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం క్రమంలో టీఆర్ఎస్ అంటే ప్రజలకు ఓ సెంటిమెంట్.. ఓ భరోసా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఊరూరా గులాబీ జెండాలను ఎగురవేశారు.

Update: 2024-10-07 10:00 GMT

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం క్రమంలో టీఆర్ఎస్ అంటే ప్రజలకు ఓ సెంటిమెంట్.. ఓ భరోసా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఊరూరా గులాబీ జెండాలను ఎగురవేశారు. కేసీఆర్ నేతృత్వంలో పుట్టుకొచ్చిన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. పెద్దమొత్తంగా ఆదరించారు. అలా.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఉద్యమపార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిపోయినప్పటికీ ప్రజల నుంచి ఆదరణ మాత్రం కోల్పోలేదు.

దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలంగాణ రాష్ట్రంలో ఓ స్థాయిలో పార్టీ ఎదిగిపోయింది. తిరుగులేని శక్తిగా మారింది. మధ్యలో టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పటికీ ప్రజలు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. అలా.. పదేళ్లపాటు పార్టీని ఆదరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు.. ఏర్పాటు అనంతరం కూడా గులాబీ పార్టీని తమ పార్టీగా భావించి గెలిపించుకున్నారు. రాష్ట్ర ఉద్యమం సందర్భంలో గులాబీ పార్టీ నేతలు ఎన్నిసార్లు రాజీనామాలు చేసి మరోసారి బరిలోకి దిగినా సెంటిమెంటును తెలుపుతూ గెలిపించుకుంటూ వచ్చారు. దాంతో ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓటమిని చూసింది లేదు. అసెంబ్లీ నుంచి మొదలుకొని.. పార్లమెంట్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందులో చూసినా గులాబీ జెండాలే రెపరెపలాడాయి.

ఇక.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీనే ఆదరించారు ప్రజలు. దాంతో మొదటి సారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా ఐదేళ్లపాటు పాలన సాగించగా.. మరోసారి వచ్చిన ఎన్నికల్లోనూ కేసీఆర్‌నే ప్రజలు గెలిపించారు. దాంతో రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ బీఆర్ఎస్ దశాబ్దకాలంపాటు ఎటువంటి ఎదురులేకుండా దూసుకెళ్లింది.

అయితే.. పార్టీకి ముందు నుంచీ కేసీఆరే అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంటుగా కేటీఆర్ కొనసాగుతున్నారు. పది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ పాలైంది. దాంతో అప్పటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చింది లేదు. కేవలం ఫామ్‌హౌజ్‌కే పరిమితం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయినప్పటికీ కనీసం పార్టీ నాయకత్వంతో అధినేత చర్చించిన దాఖలు లేవు. ఓటమికి గల కారణాలను వెతికిందీ లేదు. నాయకత్వంతో సమావేశం అయింది కూడా లేదు.

ఇక.. అధినేత పరిస్థితి అలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి కేటీఆర్ వైఖరి మరోలా ఉందని ఆ పార్టీ కేడర్‌లో టాక్. రాష్ట్రంలో కీలక సమయాల్లో ఆయన ఫారిన్ టూర్ వెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కౌశిక్ వివాదం జరిగినప్పుడు ఆయన అందుబాటులో లేరు. అలాగే.. హైడ్రా సమయంలోనూ లేరు. ఈ రెండింటి విషయాల్లోనూ హరీశ్ రావు లీడ్ తీసుకున్నారు. కేటీఆర్ కేవలం ట్విట్టర్ మెస్సేజ్ వరకే పరిమితం అయ్యారు. అటు ఖమ్మంలో వచ్చిన వరదల నేపథ్యంలోనూ బీఆర్ఎస్ లీడర్లు కనిపించలేదు. ఇక మూసీ వివాదం ఇంత పెద్ద స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ.. ఇంతవరకు కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

వీటన్నింటి నేపథ్యంలో కేడర్ తీవ్ర నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను వీడి వచ్చేది లేదని.. కేటీఆర్ నుంచి సరైన సమయంలో స్పందన ఉండడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నాయకత్వాన్ని మారిస్తేనే పార్టీకి పూర్వవైభవం వస్తుందని టాక్ నడుస్తోంది. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను వేరే వాళ్లకి అప్పగిస్తే మరోసారి గులాబీ హవా కొనసాగుతుందని.. లేదంట భవిష్యత్ మరింత అంధకారమే అవుతుందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.

Tags:    

Similar News