బాబు హైటెక్... కేసీఆర్...జగన్ అలా !
తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వార్త చదివిన వారు చూసిన వారు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వార్త చదివిన వారు చూసిన వారు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అదేంటి అంటే తెలంగాణా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త విద్యను ఒకదానిని నేర్చుకున్నారు అని. ఆయన మొబైల్ ని సొంతంగా ఆపరేట్ చేయడం నేర్చుకున్నారు అన్నదే ఆ వార్త.
ఇది చూసిన వారు అంతా కేసీఆర్ కి ఇప్పటిదాకా ఇది తెలియదా అని విస్తుబోతున్నారు. అయితే తెలియాల్సిన అవసరం అయితే లేదు అని అనే వారూ ఉన్నారు. కేసీఆర్ మొదట ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర
ఉద్యమకారుడిగా తొలి పన్నెండేళ్ళూ పోరాటం చేశారు. ఆ సమయంలో ఆయన ఫోకస్ వేరే విధంగా ఉండేది. తరువాత పదేళ్ళూ అధికారంలో ఉన్నారు.
చుట్టూ వందిమాగధులు అధికారులు ఇలా అంతా ఉన్నారు. దాంతో ఆయనకు ఏ ఫోన్ తీసుకోవాలన్నా వారే కనెక్ట్ చేసి ఇచ్చేవారు. దాంతో అలా గడచిపోయింది. ఇపుడు ఆయన మాజీ సీఎం అయ్యారు. ఖాళీ అంతా కేసీఆర్ కి 2001 నుంచి చూస్తే ఈ రోజు దాకా రాలేదు అని చెప్పాలి. అందుకే మనవడు నుంచి ఆయన మొబైల్ ఆపరేటింగ్ నేర్చుకున్నారని అంటున్నారు.
ఇపుడు సొంతంగా కేసీఆర్ ఎవరికైనా ఫోన్లు చేస్తున్నారు అని అంటున్నారు. మంచిదే అని కూడా అంతా అనుకోవాల్సిన నేపథ్యం ఉంది. ఈ ఫిబ్రవరిలో వచ్చే పుట్టిన రోజు నాటికి కేసీఆర్ వయసు 71 నిండి 72 ఏళ్ళు వస్తాయి. ఆయన ఈ ఏజ్ లో మొబైల్ ఆపరేటింగ్ నేర్చుకోవడం కూడా ఒక గొప్ప విషయమే అని అంటున్న వారూ ఉన్నారు.
ఇక ఏపీ సీఎం గా జగన్ అయిదేళ్ళ పాటు పనిచేశారు. ఎన్నికల వేళ ఆయనతో టీవీ 9 ఒక ఇంటర్వ్యూ చేసింది. అందులో తనకు ఫోన్ అన్నది వేరే లేదని పక్క వారు ఇస్తే మాట్లాడుతాను అని జగన్ చెప్పినది అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. నిజానికి జగన్ కి సంబంధించిన ఎన్నో ఇమేజ్ లు గూగుల్ లో ఉంటాయి కానీ ఏ ఒక్క దానిలోనూ ఆయన చెవిలో ఫోన్ పెట్టుకుని ఉన్న ఇమేజ్ కనబడదు. అంటే నాకు అంటూ ప్రత్యేకంగా ఫోన్ లేదని జగన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పినది కరెక్టే అని అన్న వారూ ఉన్నారు.
ఇలా తెలుగు రాష్ట్రాలలో సీఎంలుగా చేసిన వారు ఇద్దరూ ఫోన్ల విషయంలో ఉంటే బాబు హైటెక్ సీఎం గా ఉన్నారు. ఆయన ఈ విషయంలో చాలా ముందుకు వెళ్ళిపోయారు. వయసు రిత్యా ఆయన ఈ ఇద్దరి కంటే కూడా పెద్దవారు కానీ టెక్నాలజీ మీద ఆయనకు ఆసక్తి అయితే మెండు అని చెబుతారు.
బాబు అంతా ఆన్ లైన్ లోనే ఎక్కువగా రివ్యూస్ చేస్తూ ఉంటారు. టెలిఫోన్ ద్వారా ఆయన పార్టీ వారితో డైలీ సమీక్షలు చేస్తారు. మరి బాబు చేతిలో ఫోన్ అంత బిజీగా ఉంటుంది అన్న మాట. అదే జగన్ కేసీఆర్ అయితే ఫోన్ ని వాడే విషయంలో బాబు కంటే తక్కువే అని అంటున్నారు. ఆ ఇద్దరూ తమ వద్ద ఫోన్లే ఉంచుకోరు అన్నదే ఇపుడు ప్రచారంలో ఉన్న విషయం.
మరి ఈ ముగ్గురికీ ఎవరి స్పెషాలిటీస్ వారికి ఉన్నాయి. కానీ ఫోన్ లేకపోతే ప్రపంచమే లేదు అన్న ఈ కాలంలో ఫోన్ ని ఆపరేటింగ్ ని ఇపుడిపుడే నేర్చుకుంటున్న కేసీఆర్ ఒక వైపు ఉంటే నాకు ఫోన్ సొంతంగా లేదు అని చెప్పే జగన్ మరో వైపు ఉన్నారని అంటున్నారు. ఎవరి ఆలోచనలు వారివి అయినా ఫోన్ అన్న పదార్థం జగన్ కేసీఅర్ లను ఇప్పటిదాకా అంత మోజు పెంచేలా చేయకపోవడం విశేషమే అంటున్నారు.