తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్?

అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయంతో నిస్తేజంలో కూరుకుపోయిన కారుపార్టీ త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనకడుగు వేస్తోందని తెలుస్తోంది

Update: 2025-01-22 14:36 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయంతో నిస్తేజంలో కూరుకుపోయిన కారుపార్టీ త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనకడుగు వేస్తోందని తెలుస్తోంది. పోటీ చేద్దామని గులాబీ నేతలు ఉవ్విళ్లూరుతున్నా, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పోటీ వద్దని వారిస్తున్నారని సమాచారం. పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎన్నికల కదన రంగం నుంచి తప్పుకోవాలని శ్రేణలను బుజ్జగిస్తున్నారని చెబుతున్నారు.

2023 వరకు ఎన్నిక ఏదైనా తెలంగాణలో ఏ మూలన పోటీ అన్నా గులాబీ పార్టీదే హవా. 2014-2023 మధ్య బీఆర్ఎస్‌ పార్టీకి పోటీగా అభ్యర్థిని బరిలోకి దింపాలంటేనే విపక్షాలు ఆలోచించే పరిస్థితి ఉండేది. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడదే పార్టీ ఎన్నిక అంటేనే భయపడిపోతోంది. కంచుకోటగా చెప్పే ఉత్తర తెలంగాణలో సైతం పార్టీ బలహీనమైందనే అభిప్రాయంతో త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే ఎన్నికల్లో పోటీకి పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నా అధిష్టానం మాత్రం వద్దని వారిస్తుండటమే చర్చనీయాంశంగా మారింది.

మార్చిలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ సీటులో కాంగ్రెస్ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఇదే స్థానాన్ని రెండుసార్లు గెలుచుకున్న గులాబీ నేతలు ఇప్పుడు కూడా పోటీకి రెడీ అంటున్నా అధిష్టానం మాత్రం వద్దని అంటోందట.. తెలంగాణ ఉద్యమ సమయంలో కోరి మరీ ఎన్నికలను తెచ్చుకున్న గులాబీ పార్టీ అపోజిషన్‌లోకి వచ్చేసరికి డీలా పడిపోయింది. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్‌లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం ప్రభావం నుంచి ఇంకా తేరుకోకపోవడం వల్లే వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండాలని కారు పార్టీ నేతలు రూటు మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. పోటీ చేసి ఓటమి మూటగట్టుకునే కన్నా, ఎన్నికకు దూరంగా ఉండి తమ బలం, బలగంపై అధికార పక్షాన్ని భయపెట్టడమే బెటర్ అనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

మార్చిలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే నెలలో జరిగే అవకాశం ఉందంటున్నారు. సిట్టింగ్ శాసన మండలి సభ్యుల పదవీకాలం పూర్తికాకముందే ఈ ఎన్నికలను నిర్వహించాల్సివున్నందున ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, బీజేపీ కూడా బలమైన ప్రత్యర్థిగా తలపడుతుండటం వల్ల మధ్యలో దూరి అబాసుపాలు అవ్వడం దేనికనే ఆలోచనతోనే పోటీ వద్దని గులాబీ హైకమాండ్ వారిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఎన్నికల కదనరంగంలో విరోచిత పోరాటం చేసిన గులాబీదళం అధికారం కోల్పోయిన ఏడాదికే అస్త్ర సన్యాసం చేయాల్సిరావడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ అనువుగాని చోట అధికలమనరాదు అన్న చందంగా పార్టీ అధిష్ఠానం కార్యకర్తలను సముదాయిస్తూ రేసు నుంచి తప్పుకోమనే సంకేతాలనే బలంగా పంపుతోంది.

Tags:    

Similar News