కారు.. కమలం కలవాలన్నది ఎవరి ప్లాన్?
ఇక్కడ మర్చిపోలేని పాయింట్ ఏమంటే.. కేసీఆర్ వద్దకు వెళ్లి.. ఈ తరహా సూచనలు చేసే సత్తా ఎవరికి ఉంది? ఆయన మనసుకు భిన్నంగా మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంది?
గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర రాజకీయ చర్చ నడుస్తోంది. తెలంగాణ విపక్షం బీఆర్ఎస్.. మరో పార్టీ బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు పొడవనుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇందులో నిజం మాట ఎంతన్నది ఒక మాట అయితే.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవాలని బలంగా అనుకుంటున్న వారెవరు? అన్నది ప్రశ్న. కమలం వర్సెస్ కారు పార్టీల మధ్య నడిచిన లడాయి అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు అనుకున్న మాటలు ఒక రేంజ్ లో ఉంటాయి. అంతేనా.. డైలీ బేసిస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి మంత్రి హోదాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. అన్న మాటలు తక్కువేం కావు.
అయితే..రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు అన్నది ఎవరూ ఉండరన్న నానుడికి తగ్గట్లే.. కమలం.. కారు మధ్య పొత్తు పొడవాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే.. ఈ ప్రపోజల్ వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి అని చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బలంగా ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కమలం పార్టీతో దోస్తానా చేయటానికి మించిన ప్రత్యామ్నాయం మరేమీ లేదన్న మాట కారు పార్టీ నేతల నోటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర వ్యాఖ్యానిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక్కడ మర్చిపోలేని పాయింట్ ఏమంటే.. కేసీఆర్ వద్దకు వెళ్లి.. ఈ తరహా సూచనలు చేసే సత్తా ఎవరికి ఉంది? ఆయన మనసుకు భిన్నంగా మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంది? ఓవైపు మోడీని ఉద్దేశించి అన్నేసి మాటలు అనేసి.. ఇప్పుడు ఎన్నికల్లో పొత్తు అంటే అదేమీ చిన్న మాట కాదు. పరిస్థితి బాగోలేనప్పుడు.. టైం ఎదురుతిరిగిన వేళ మోడీషాల వద్దకు వెళ్లి పొత్తు మాట మాట్లాడితే వారి నుంచి వచ్చే ప్రపోజల్స్ ఎంతలా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ సిద్ధమంటే దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాత్రమే చెప్పాలి.
ఆయన దూకుడుకు కళ్లాలు వేసేందుకు బీజేపీతో ప్రస్తుతానికి చేతులు కలిపితే.. ఆ తర్వాత చేయాల్సింది చేయొచ్చన్నది గులాబీ నేతల మాటగా చెబుతున్నారు. ఇంతకూ కేసీఆర్ వద్దకు బీజేపీతో పొత్తు ప్రస్తావన తీసుకెళ్లింది ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి కం గులాబీ పార్టీలో కీలక భూమిక పోషించే కుమారరత్నం కేటీఆర్ నుంచే ఈ ప్రపోజల్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనికి హరీశ్ ఆమోదం కూడా ఉందంటున్నారు.
అంతకంతకూ ఎక్కువ అవుతున్న రేవంత్ అధిక్యాన్ని తగ్గించేందుకు కేటీఆర్ ఈ సూచన చేసినట్లుగా చెబుతున్నారు. బీజేపీతో చేతులు కలిపితే.. రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా మారటంతో పాటు.. కేంద్రంలో పవర్ లోకి వచ్చే మోడీ సర్కారుతో రేవంత్ దూకుడుకు కళ్లాలు వేయొచ్చన్నది ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతానికి రేవంత్ గండం నుంచి బయటపడేందుకు బీజేపీతో చెలిమి చేసినా తప్పేం కాదన్నది కేటీఆర్ ఆలోచనగా చెబుతారు.
బీజేపీతో చేతులు కలపటం ఎందుకు? అంటూ ప్రశ్నించే గులాబీ నేతలు మిస్ అయ్యే అసలు పాయింట్ ఏమంటే.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రెండు.. మూడు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదంటున్నారు. అదే జరిగితే ఉనికికే ప్రమాదంగా మారుతుందని.. పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెను ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తుందన్నది గులాబీ ముఖ్యనేత ఆలోచనగా చెబుతున్నారు.
ఈ వాదనతో గులాబీ బాస్ కేసీఆర్ సైతం కన్వీన్స్ అయ్యారని.. కానీ, బీజేపీతో చేతులు కలిపే విషయంలో సంశయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ.. బీఆర్ఎస్ పొత్తు చర్చ తెర మీదకు వచ్చిందని.. గులాబీ దళం సైతం సానుకూలంగా స్పందించే అంశాన్ని సారుకు చూపిస్తే ఆయన మనసు మారుతుందన్న ఆశతో జరుగుతున్నదే అసలు కథంతా అని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.