సంబరాలు చేయండ్రి: బీఆర్ఎస్ పిలుపు
బీఆర్ఎస్ కీలక నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బీఆర్ ఎస్ కీలక నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘకాలంగా(5 నెలలు పైబడి -164 రోజులు) కవిత తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆమె ఈ రోజురాత్రి లేదా.. రేపు ఉదయం జైలు నుంచి బయటకు రానున్నారు. దీనికి సంబంధించి కొన్ని లాంఛనాలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ ఎస్ పార్టీలో నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకురాలు బయటకు రావడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.
ఇదే విషయంపై బీఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఇది సంబరాల సమయం అని పేర్కొన్నారు. జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు కాలుస్తున్నారు. హైదరాబాద్‌లోని బీఆర్ ఎస్ భవన్‌లోనూ నాయకుల సందడి పెరిగింది. కవితకుబెయిల్ వచ్చిన నేప థ్యంలో కేసీఆర్ మీడియా సమావేశానికి రెడీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఆయన బీఆర్ ఎస్ భవన్‌లోనే మీడియాతో మాట్లాడనున్నారని తెలిసింది.
ఇక, కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను పురస్కరించుకుని మాజీ మంత్రులు, బీఆర్ ఎస్ కీలక నాయ కులు హరీష్‌రావు, కేటీఆర్ సహా..పలువురు ఎంపీలు(రాజ్యసభ), మాజీ ఎంపీలు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. బెయిల్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే వారు హర్షం వ్యక్తం చేస్తూ.. బయటకు వచ్చా రు. రాష్ట్ర పార్టీ నాయకులతోనూ వారు మాట్లాడారు. జిల్లాల్లో సంబరాలు చేసుకోవాలని క్షేత్రస్థాయి నాయకులకు పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే.. కవిత జైలు నుంచి బయటకు రాగానే ఆమెను గజ మాలతో సత్కరించి.. ఘనంగా ఆహ్వానం పలకాలని పార్టీ నిర్ణయించుకుంది. ఇది దురుద్దేశ పూరితమైన కేసు అని.. ఆది నుంచి చెబుతున్న బీఆర్ ఎస్ ఈ కుట్రలో తాము బలయ్యామని.. కానీ, ఇప్పుడు బయటకు వచ్చామని.. చెబుతున్నారు. ఈ క్రమంలో కవితకు ఘన స్వాగత సత్కారాలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక, మీడియాతో కేసీఆర్ ఏం మాట్లాడతారో చూడాలి.