ఉద్యోగులను బీఆర్ఎస్ రెచ్చగొడుతోందా ?

ఎందుకంటే సంవత్సరాల తరబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటాన్ని కేసీయారే స్వయంగా వ్యతిరేకించారు

Update: 2023-08-05 05:02 GMT

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల వ్యవహారం భలే విచిత్రంగా ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి ఈ నిర్ణయమే నూరుశాతం రాజకీయం అని అందరికీ తెలుసు. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటాన్ని కేసీయారే స్వయంగా వ్యతిరేకించారు. భూగోళం ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని ఎన్నోసార్లు స్పష్టంగా ప్రకటించారు. అలాంటిది సడెన్ గా ఇపుడు ఎవరూ అడగకపోయినా తనంతట తానే ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేద్దాం. విలీనంకు అవసరమైన డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేసి ఆమోదం కోసం ప్రభుత్వం గవర్నర్ దగ్గరకు పంపింది. బిల్లు రాజ్ భవన్ కు చేరి రెండురోజులే అయ్యింది. మూడోరోజు అంటే శనివారం ఉదయం నుండే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులంతా ఆందోళనకు దిగేశారు. విదులకు హాజరవ్వకుండా మెరుపుసమ్మె మొదలుపెట్టారు. దేనికంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ సంతకం పెట్టలేదని నిరనసగానట.

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల వైఖరి ఎంత విచిత్రంగా ఉందో అర్ధమైపోతోంది. గవర్నర్ సంతకం పెట్టడానికి పెట్టకపోవటానికి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఏమిటి సంబంధం ? రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హడావుడిగా బిల్లును తయారుచేసి సంతకం కోసం రాజ్ భవన్ కు పంపితే వెంటనే గవర్నర్ సంతకం పెట్టేయాల్సిందేనా ? ఆ బిల్లులో న్యాయపరమైన లొసుగులు ఏమన్నా ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ కు లేదా ?

అసలు గవర్నర్ సంతకం పెట్టలేదని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా రాజ్ భవన్ను ముట్టడించటం మొదలుపెడితే శాంతి భద్రతలు క్షీణించవా ? గతంలో ఎప్పుడూ ఏ శాఖకు చెందిన ఉద్యోగులు కూడా ఇలా గవర్నర్ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేసిన ఘటనలేదు. ఇపుడు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్నారంటేనే వీళ్ళని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టి రోడ్డుమీదకు దింపినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. గవర్నర్ మీదకు ఉద్యోగులను ప్రభుత్వమే రెచ్చగొట్టి పంపుతున్నదన్న ఆరోపణలే ఆశ్చర్యంగా ఉంది వినటానికి.

Tags:    

Similar News