బీఆర్‌ఎస్.. ఆ నాలుగు సీట్లకు కూడా అభ్యర్థుల ఖరారు!
కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించని నాలుగు స్థానాల్లో గోషా మహల్, నర్సాపూర్, జనగామ, నాంపల్లి ఉన్నాయి
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సృష్టించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా 115 చోట్ల అభ్యర్థులను వెల్లడించారు. మరో నాలుగు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించని నాలుగు స్థానాల్లో గోషా మహల్, నర్సాపూర్, జనగామ, నాంపల్లి ఉన్నాయి. వీటిలో గోషా మహల్ బీజేపీ సిట్టింగ్ సీటు. ఇక్కడ రాజా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీకి బలమున్న గోషా మహల్ లో 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున రాజా సింగ్ గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేసే అవకాశముంది.
ఇక గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున గోషా మహల్ లో పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి బీఆర్‌ఎస్ తరఫున నందకుమార్ వ్యాస్ ను బరిలోకి దింపుతారని తెలుస్తోంది. వ్యాస్ 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు.
అలాగే నర్సాపూర్ లో మాజీ మంత్రి సునీతా లక్షా్మరెడ్డిని బరిలోకి దింపొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి మొదటి జాబితాలోనే ఆమె పేరు వెలువడాల్సి ఉంది. 1999, 2004, 2009ల్లో సునీత లక్షా్మరెడ్డి నర్సాపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొంది హ్యాట్రిక్ సృష్టించారు. వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగానూ పనిచేశారు.
2014. 2018 ఎన్నికల్లో సునీత టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుముల మదన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ లో చేరారు. మరోవైపు రెండుసార్లు టీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన మదన్ రెడ్డికి ఈసారి కేసీఆర్ సీటు కేటాయించలేదు. ప్రస్తుతం నర్సాపూర్ కు కూడా సునీత లక్షా్మరెడ్డిని ఫైనల్ చేసినట్టు సమాచారం.
ఇక జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విజయం సాధించారు. అయితే భూకబ్జాల వ్యవహారం, సొంత కూతురే ముత్తిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈసారి కేసీఆర్ ఆయనకు సీటు కేటాయించలేదు. ఇక్కడ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వరరెడ్డిని అభ్యర్థిగా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక నాంపల్లిలో 2009, 2014, 2018 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులే గెలిచారు. ఇక్కడ టీఆర్‌ఎస్ 2014, 2018 ఎన్నికల్లో కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేదు. 2014లో నాలుగో స్థానంలో 2018 ఎన్నికల్లో మూడో స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నిలిచారు. ఈసారి ఇక్కడ నుంచి ఆనంద్ గౌడ్ ను బరిలోకి దింపడానికి కేసీఆర్ నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది.
కేసీఆర్ మొదటి విడతలో పేర్లు ప్రకటించని నాంపల్లికి ఆనంద్ గౌడ్ ను, నర్సాపూర్ కు సునీత లక్షా్మరెడ్డిని, జనగాంకు పల్లా రాజేశ్వరరెడ్డిని, గోషా మహల్ లో నందకుమార్ వ్యాస్ ను బరిలోకి దించుతారని తెలుస్తోంది. ఈ నలుగురు పేర్లనే ఫైనల్ చేసినట్టు సమాచారం. నేడో, రేపో ఈ నలుగురు పేర్లను కేసీఆర్ వెల్లడిస్తారని అంటున్నారు.