47-37-17 ఏంటి స్కోర్ ?
నంబర్లలోనే అంతా ఉంది. పాలిటిక్స్ మొత్తం నంబర్ గేం. సీట్లూ ఓట్లూ అన్నీ కూడా నంబర్ మీదనే ఆధారపడి నడుస్తాయి.
నంబర్లలోనే అంతా ఉంది. పాలిటిక్స్ మొత్తం నంబర్ గేం. సీట్లూ ఓట్లూ అన్నీ కూడా నంబర్ మీదనే ఆధారపడి నడుస్తాయి. నంబర్ హై లెవెల్ లో ఉంటే ఆ పార్టీ కూడా పీక్స్ లో ఉంటూ హల్ చల్ చేస్తుంది. అదే నంబర్ డౌన్ లో ఉంటే నేల చూపులు చూడడమే. ఒక విధంగా చెప్పాలంటే వర్తమాన రాజకీయాలు అన్నీ స్టాక్ ఎక్సెంజ్ మార్కెట్ సూచీలుగానే ఉన్నాయి.
నిన్నా ఈ రోజూ రేపూ అని గ్రాఫ్ ని ఎప్పటికపుడు లెక్క వేసుకుంటూ జంపింగ్ జఫాంగులు గోడలు దూకేస్తూంటే పార్టీలను పెట్టుకున్న పుణ్యానికి అధినేతలు మాత్రం వాటిని అట్టేబెట్టుకుని ఎవరూ బయటకు పోకుండా చేసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. తెలంగాణాలో బీఆర్ఎస్ అనే ఒకనాటి ఉద్యమ పార్టీ పరిస్థితి ఇప్పుడు చూస్తే గందరగోళంగానే ఉంది.
గులాబీ దళంలో గుబులు రేగుతోంది. శిబిరంలో ఉండేవారు ఎవరూ పోయేవారు ఎవరూ అన్నది ఎడతెగని చర్చగా సాగుతోంది. ప్రత్యర్ధి పార్టీలు రెండూ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. అన్ని విధాలుగా ధీటుగా ఉన్నాయి. దాంతో జంపింగ్ జఫాంగులు కాదేదీ దూకుడుకు అనర్హం అన్న లెక్కన గులాబీ గోడ దూకి నచ్చిన పార్టీలలోకి జంప్ చేస్తున్నారు
ఇదిలా ఉంటే ఎందుకు ఇలా వరసబెట్టి జంప్ చేస్తున్నారు అంటే బీఆర్ ఎస్ గ్రాఫ్ ని చూపిస్తున్నారు. అది గత అయిదేళ్ళలో డౌన్ ఫాల్ అవుతున్న తీరుని చూపిస్తున్నారు. దాంతో గులాబీ తోటలో ఉండడం క్షేమకరం కాదని భావించే గోడ దూకుళ్ళను స్టార్ట్ చేశారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బీఆర్ఎస్ గ్రాఫ్ ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది.
గులాబీ పార్టీ అజేయంగా వెలిగిన నాడు అంటే 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 47 శాతం ఓటింగ్ షేర్ ని సంపాదించి అధికారంలోకి వచ్చింది.అదే గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి 37 శాతం ఓటు షేర్ పడిపోయి 2023 ఎన్నికల్లో ఓటమిని చవి చూసింది. ఇక ఆరు నెలల వ్యవధిలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే ఆ 37 శాతం ఓటు షేర్ కూడా 17కి పడిపోయింది. అంటే ఇది డ్రాస్టిక్ డౌన్ ఫాల్ అని అంటున్నారు.
ఒక్కసారిగా ఇరవై శాతం ఓట్లు ఎక్కడికి పోయాయి అన్నది బీఆర్ఎస్ కి అతి పెద్ద ప్రశ్న. ఆ ఓట్లను మాగ్జిమం బీజేపీ లాగేసి సెకండ్ ప్లేస్ కి వచ్చేసింది. దాంతో బీఆర్ఎస్ మరింత కుదేల్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కాస్తా ఓర్చుకున్న నేతలు కూడా పార్లమెంట్ ఫలితాలు చూశాక గులాబీ తోటలో ఉంటే అసలు సేఫ్ కాదని భావించి కాంగ్రెస్ బీజేపీలోకి క్యూ కడుతున్నారు.
ప్రతీ ఎన్నికకూ బీఆర్ ఎస్ గ్రాఫ్ తగ్గిపోవడంతోనే అందులో ఉన్న నేతలకు ఉక్క బోత మొదలైంది అని అంటున్నారు. ఇలాగే క్షీణ దశ కొనసాగితే పార్టీ సంగతి దేముడెరుగు మన సంగతి ఏంటి అని ఆలోచించుకున్న వారు అంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అని అంటున్నారు.
వాస్తవంగా బీఆర్ఎస్ లో నేతలు అంతా బాగా ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. బీఆర్ఎస్ రాజకీయంగా ఏటికి ఎదురీదుతోందని గ్రహించిన వారే తొందరగా మేలు కుంటున్నారు. మూటా ముల్లె సర్దుకుంటున్నారు. ఇక వారికి కళ్ళ ముందు భారీ ఆఫర్లు కూడా ఉండడంతో టెంప్ట్ అవుతున్నారని అంటున్నారు.
కేంద్రంలో బీజేపీ ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. ఎలా ఎందులోకి వెళ్ళాలి అన్న దాని మీద ఎవరి ఆలోచనలు వారు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పరమార్ధం అనుకునే వారు తెలంగాణాలో అవసరాలు ఉన్నవారు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అదే విధంగా బాగా సంపాదించిన లీడర్లు ఇంకం టాక్స్ గొడవలు ఉన్నాయనుకున్న వారు సేఫ్ జోన్ గా బీజేపీని ఎంచుకుంటున్నారు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే ఇది పూవులు పూయని తోట అని భావించిన మీదటనే గులాబీ పార్టీకి ఒక పెద్ద దండం పెట్టేస్తున్నారు అని అంటున్నారు. బీఆర్ఎస్ ఫ్యూచర్ ని సరిగ్గా లెక్కించిన మీదటనే జంపింగ్ జఫాంగులు ఏరు దాటుతున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేసీఆర్ అందరితో మాట్లాడుతూ ఉందిరే మంచి కాలం అని ఎన్ని ముచ్చట్లు చెప్పినా పుంజాలు తెంపుకుని బరి దాటి పరుగులు తీస్తున్న వారి చెవులకు ఇవి ఎక్కుతాయా అన్నదే పెద్ద డౌట్.