చేసుకున్నోడికి చేసుకున్నంత.. కేసీఆర్ అనుభవిస్తున్నారా?

ఇందులో భాగంగా మొదటిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారడం సంచలనం కలిగిస్తోంది

Update: 2024-03-18 07:20 GMT

చెరపకురా చెడేవు అంటారు. గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. ఇప్పుడు అదే దారిలో నీవు చెప్పిన విద్యయే కదా నీరజాక్షా అన్నట్లు కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొదటిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారడం సంచలనం కలిగిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని కేటీఆర్, హరీష్ రావు పదేపదే చెబుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారని చెబుతున్నారు. ఇంకా చాలా మంది నేతలు తమతో టచ్ లోనే ఉన్నారని కాంగ్రెస్ నేతలు కూడా వెల్లడిస్తున్నారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారడం బీఆర్ఎస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఇంకా కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తెల్లం వెంకటరావు, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు కూడా రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తయారుగా ఉన్నారని అంటున్నారు.

బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరాలని చూస్తున్నారు. వలసలు పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగుతాయని తెలుస్తోంది. అయినా బీఆర్ఎస్ నేతల అహంకార ధోరణి పోవడం లేదు. దీంతో ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చీలికలు వచ్చి అందరు కాంగ్రెస్ లో చేరతారని చెబుతున్నారు.

మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధం కావడంతో బీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. దానం నాగేందర్ పార్టీ మారడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు తెలియలేదా? తాను చేస్తే మంచిది ఇతరులు చేస్తే మాత్రం చెడ్డదా? అనే కోణంలో విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News