బీఆర్ఎస్ లో టెన్షన్ పెంచేస్తున్న కోర్టు కేసులు

బీఆర్ఎస్ అధినేత కేసీయార్ తో పాటు 28 మంది ప్రజాప్రతినిధుల పై కోర్టుల్లో వివిధ కేసులున్నాయి.

Update: 2023-08-03 06:56 GMT

కారు పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీయార్ తో పాటు 28 మంది ప్రజాప్రతినిధుల పై కోర్టుల్లో వివిధ కేసులున్నాయి. వీటిల్లో ఎన్నికల కు సంబంధించిన కేసులు, అవినీతి కేసులు, అక్రమార్జన కేసులు కూడా ఉన్నాయి.

కొత్తగూడెం ఎంఎల్ఏ వనమా వెంకటేశ్వరరావును ఎంఎల్ఏ గా కోర్టు అనర్హుడిని చేయటంతో మొదలైన టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది. అఫిడవిట్ ను మంత్రి శ్రీనివాస గౌడ్ ట్యాంపరింగ్ చేశారని రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ కొట్టేయాలని మంత్రి కోరితే కోర్టు కుదరదు పొమ్మన్నది.

రాజు దాఖలు చేసిన పిటీషన్లో విచారణకు అర్హత ఉందని చెప్పి వెంటనే విచారణ చేయమని ఆదేశించింది. అలాగే మరో మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల అక్రమాల పై బీజేపీ నేత బండి సంజయ్ వేసిన కేసు లో విచారణ స్పీడు పెరిగింది. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ పైన దాఖలైన కేసు లో కూడా విచారణను స్పీడుపెంచింది. అలాగే పద్మారావు, గొంగిడి సునీత, గ్యాదరి కిషోర్, పట్నం నరేంద్రరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాధ్, బీబీ పాటిల్ లాంటి అనేకమంది పై అనేక కేసులున్నాయి.

ఈ కేసులన్నీ సంవత్సరాలుగా మురిగిపోతున్నాయి. అలాంటి వాటికి హైకోర్టు ఒక్కసారిగా దుమ్ముదులిపింది. కేసులన్నింటినీ 12 మంది జడ్జీల మధ్య చీఫ్ జస్టిస్ విభజించారు. రోజువారీ విచారణ చేసి కేసుల పరిష్కారాన్ని వెంటనే చేయాలన్నారు. చీఫ్ జస్టిస్ ఆదేశాలతో జడ్జీలంతా తమకు కేటాయించిన కేసుల వివరాలను తెప్పించుకున్నారు.

ఏ కేసును ఎప్పుడు విచారించాలనే విషయమై తేదీలను ప్రకటించబోతున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. మరోవైపు ఎప్పటికేసులనో హైకోర్టు ఇపుడు దుమ్ముదులిపి విచారణ లో స్పీడు పెంచుతోంది. మరో వైపు అనర్హత వేటు భయం తదితరాలతో ప్రజాప్రతినిదుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

కేసీయార్ తో పాటు మంత్రులు, అధికారపార్టీకే చెందిన ఎంఎల్ఏల మీద ఇన్ని కేసులు విచారణ లో స్పీడు పెరగటం బహుశా దేశంలో ఇదే మొదటిసారేమో. ఎన్నికల్లోపు తీర్పులు గనుక వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే కనీసం అప్పీలు చేసుకోవటానికి కూడా సరిపడా సమయం ఉండదు. ఇక వనమా మీద పడినట్లే అనర్హత వేటు పడితే వీళ్ళందరి పని గోవిందానే.

Tags:    

Similar News