ఇలా అయితే అధికారమెలా.. బీజేపీ నేతల అంతర్మథనం!

తెలంగాణలో గతేడాది చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది.

Update: 2024-07-11 17:30 GMT

తెలంగాణలో గతేడాది చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 8 అసెంబ్లీ సీట్లు, 17 పార్లమెంటు స్థానాలకు గానూ 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తక్కువ వచ్చినా వోటింగ్‌ షేర్‌ మాత్రం బాగానే వచ్చింది. చాలా చోట్ల కాంగ్రెస్‌ పార్టీ తర్వాత స్థానంలో నిలిచింది. దీంతో ఆ స్థానాల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పడిపోయింది.

ఈ నేపథ్యంలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో రావాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుస్తామని బీజేపీ నేతలు తరచూ చెబుతున్నారు. అయితే అదంతా ఈజీ కాదనే విషయం వారికి కూడా తెలుసు. ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్‌ వంటి జిల్లాల్లో బీజేపీకి అంత బలం లేదు.

ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో బలమైన నేతలను చేర్చుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇందులో ఏడెనిమిది మంది ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. మరికొంత మంది కూడా ఈ వరుసలో ఉన్నారని తెలుస్తోంది.

గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఉన్న వైరం, మాటతేడాలు వల్ల కొందరు నేతలకు కాంగ్రెస్‌ లోకి ప్రవేశం దక్కడం లేదు. ఇలాంటివారిలో మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి, పఠాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి వంటివారున్నారు.

ఇక్కడ రేవంత్‌ రెడ్డి తమను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోరని భావించిన ఈ ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి వ్యవహారం చక్కబెట్టుకుందామని చూశారు. మల్లారెడ్డి అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కూడా అయిన డీకే శివకుమార్‌ ను కూడా కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ఆసక్తి చూపారు, అయితే రేవంత్‌ రెడ్డిని సంప్రదించకుండా, ఆయనకు ఇష్టం లేకుండా డీకే శివకుమార్‌ ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నారు.

దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే బీజేపీ పెట్టే షరతులే వారికి ఇబ్బందిగా ఉన్నాయని అంటున్నారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారట. గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా తమ ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు. ఇద్దరూ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ తరఫున పోటీ చేసిన ఈటల గెలుపొందగా, కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీలోకి ఎవరు రావాలనుకున్నా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాదిరిగా రాజీనామా చేసి రావాల్సిందేనని బీజేపీ నేతలు చెబుతున్నట్టు సమాచారం.

అయితే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తలపడితే ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏమిటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారట. ఏ షరతులూ పెట్టకుండా కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగానే తమను బీజేపీలో చేర్చుకుంటే చేరడానికి సిద్దంగా ఉన్నట్టు ఆ పార్టీ పెద్దలకు తెలియజేసినట్టు సమాచారం.

బీజేపీ కూడా ముందు కీలక నేతలను పార్టీలో చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలి కానీ ఇలా తమ పార్టీలోకి రావాలంటే ఇప్పటికే ఉన్న పదవులకు రాజీనామా చేసి రావాలని కోరడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే బీజేపీ ఎప్పుడు బలపడేను.. ఎప్పుడు అధికారంలోకి వచ్చేను అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News