కేటీఆర్.. కింకర్తవ్యం!
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ కు కుడి భుజంలా వ్యవహరించిన కేకే (కంచర్ల కేశవరావు)తోపాటు భద్రాచలం, ఖైరతాబాద్, జగిత్యాల, బాన్సువాడ, స్టేషన్ ఘనపూర్, చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, కాలే యాదయ్య కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.
దీంతో అప్రమత్తమైన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ ఎమ్మెల్యేలను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకుని వారికి నచ్చచెబుతున్నారు. అయినా ఫలితం ఉండటం లేదు. కే సీఆర్ తన ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆ మరుసటి రోజే కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.
కేవలం ఈ ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే కాదని మరికొందరు కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వ లక్షణాలపై నీలినీడలు అలముకున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో గతంలో బీఆర్‌ఎస్ కు పెద్దగా మద్దతు ఉండేది కాదు. అలాంటి దాన్ని చాలెంజింగ్ గా తీసుకుని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పాగా వేసేలా కేటీఆర్ బాగానే కష్టపడ్డారు. అందుకు కేటీఆర్ కు మంచి ప్రశంసలే దక్కాయి.
గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ రాష్ట్రమంతా బీఆర్‌ఎస్ కు గట్టి దెబ్బ పడ్డా జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం ఆ పార్టీ దుమ్ములేపింది. మొత్తం 15 స్థానాలు గెలుచుకుని విజయనాదం చేసింది. కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది.
అలాంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిపోయారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హైదరాబాద్ కు సమీపంలోని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
దీంతో పార్టీని వదిలిపోతున్న వారిని పోకుండా చేయడంతో కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విఫలమవుతున్నారనే టాక్ నడుస్తోంది. సక్సెస్ లు వచ్చినప్పుడు ప్రశంసలు అందుకున్నా ఒక నాయకుడి సమర్థ నాయకత్వ లక్షణాలు సంక్షోభంలోనే బయటపడతాయి. కఠిన పరిస్థితుల్లో, సంక్షోభ పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు నడిపించారనేదే కీలకం. అయితే కేటీఆర్ ఈ విషయంలో విఫలమయ్యారని అంటున్నారు.
తమ చేజారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో, వారిని పార్టీ మారకుండా నచ్చచెప్పడంలో కేటీఆర్ విఫలమయ్యారని చెబుతున్నారు. పెరుగుతున్న వయసు, వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా కేసీఆర్ అంతకుముందులా క్రియాశీలకంగా లేరు. కేటీఆరే పార్టీని నడిపించాల్సి ఉంది. కానీ ఎప్పుడు ఏ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరతారో తెలియని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిస్థితి కేటీఆర్ నాయకత్వ లక్షణాలకు గట్టి పరీక్షేనని టాక్ నడుస్తోంది. మరి కేటీఆర్ ఆన్ డ్యూటీలో సక్సెస్ అవుతారా? లేదా? వేచిచూడాల్సిందే.