రేవంత్ ని కలిసిన బీఆరెస్స్ ఎమ్మెల్యేలు... నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష?

ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-01-23 15:03 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ కు గట్టి షాక్ తగిలిందనే కామెంట్లు వినిపించాయి. ఈ సందర్భంగా... శృతిమించిన నియంతృత్వ పోకడలకు ఫలితం అని కొందరంటే.. నేల విడిచి చేసిన సాముకు ప్రతిఫలం అని మరికొందరు వ్యాఖ్యానించారు!! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆరెస్స్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అవును... దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నలుగురు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంట్లోనే.. ఈ నలుగురు ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. దీంతో ఈ విషయం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఫలితంగా... రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది బీఆరెస్స్ కు బిగ్ షాక్ అనే కామెంట్లు కూడా మొదలైపోయాయి!

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిన బీఆరెస్స్ నేతల్లో... నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు. ఈ విషయాలపై స్పందించిన ఈ బీఆరెస్స్ ఎమ్మెల్యేలు... నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు మర్యాదపూర్వకంగా భేటీ అని చెబుతున్నారు!

వీరు ఎలా చెప్పినా, ఏమని చెప్పినా... త్వరలో వీరంతా హస్తం గూటికి చేరబోతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలైపోయింది. పైగా... రాబోయే లోక్ సభ ఎన్నికలపై బీఆరెస్స్ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే.. ఇలా ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ అవ్వడం.. బీఆరెస్స్ కు పెద్ద షాకే అని అంటున్నారు పరిశీలకులు. ఇక ఈ "మర్యాదపూర్వక భేటీ" రిజల్ట్ ఏమిటనేది వేచి చూడాలి!

కాగా... దావోస్ పర్యటనలో ఉన్న సమయంలో... "పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆరెస్స్ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతాం" అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... తాము తలుచుకుంటే బీఆరెస్స్ ను 14 ముక్కలు చేయగలమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే.

ఇదే సమయంలో తమతో సుమారు 30 మంది బీఆరెస్స్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అలాంటి చర్చ తెరపైకి వచ్చిన వారంరోజుల లోపే బీఆరెస్స్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీ పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. కాగా... ప్రధానంగా 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను గంపగుత్తగా కేసీఆర్.. బీఆరెస్స్ లో చేర్చుకున్న సంగతి తెలిసిందే!!

Tags:    

Similar News