మొన్న అమావాస్య సరే.. ఇవాళ ఏమైంది? గులాబీ పార్టీలో 21 బీఫారాల గుబులు!
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బీఫారాలు అందాల్సిన 21 మందిలో 12 మంది హైదరాబాద్ మహానగరానికి చెందిన నేతలే ఉండటం గమనార్హం.
టెన్షన్ తో వణుకు పుట్టిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాను ఊరికి ముందే ప్రకటించిన ఆయన.. ఇప్పుడు బీఫారాలు అందజేసే విషయంలో విడతల వారీగా వ్యవహరిస్తున్న వైనం ఆ పార్టీలో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. బీఫారాల తయారీని ఆచితూచి అన్నట్లుగా చేస్తున్నారని.. ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వేళ.. వాటి తయారీ ఆలస్యమవుతుందని చెబుతున్నా.. అసలు కారణం అది కాదన్న మాట వినిపిస్తోంది.
అభ్యర్థులను ఎప్పుడో నిర్ణయించేసి.. జాబితాను విడుదల చేసిన తర్వాత బీఫారాల తయారీని ముందస్తుగా చేయరా? అన్న మాట వినిపిస్తోంది. ఆదివారం అభ్యర్థులకు బీఫారాలు ఇస్తామని ముందు నుంచి చెబుతున్నప్పుడు.. అలా ఎందుకు జరగలేదన్నది మరో ప్రశ్న. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. శనివారం అమావాస్య కావటంతో.. ఆదివారం ఉదయం నుంచి బీఫారాలు తయారీ మొదలైందని చెబుతున్నా.. ఆ వివరణ అతికినట్లుగా లేదంటున్నారు.
బీఫారాల్ని ముందు రోజు నుంచి కానీ ఆ రోజుకు ఆరోజు కానీ తయారు చేయరు కదా? అభ్యర్థులు ఎవరన్నది అధికారికంగా ఎప్పుడోప్రకటించేసినప్పుడు.. బీఫారాలు అందజేసే ముందు రోజు నుంచి తయారీ ఎందుకు మొదలు పెడతారు? ఇదంతా ఉత్తుత్తి మాటలే తప్పించి మరొకటి లేదన్న మాట వినిపిస్తోంది. కేవలం కవరింగ్ కోసమే.. అమావాస్య పేరును తెర మీదకు తెచ్చారంటున్నారు. మారిన సమీకరణాలు.. అభ్యర్థుల విషయంలో పునరాలోచనలు కూడా కారణం కావొచ్చంటున్నారు.
ఇందుకు తగ్గట్లే.. ఆదివారం ఇచ్చిన 69 బీఫారాలకు సోమవారం మరో 29 మందికి మాత్రమే ఇచ్చిన వైనాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో మొత్తం 98 మందికి బీఫారాలు అందజేసినట్లు అవుతుందని.. మరో 21 మందికి ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. నామినేషన్ దాఖలుకు నవంబరు 10 తేదీ వరకు గడువు ఉండగా.. ఇప్పటికే అందరికి బీఫారాలు వచ్చేస్తున్న వేళ.. తమకు రాకపోవటంపై పెండింగ్ అభ్యర్థులు ఆగమాగం అవుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బీఫారాలు అందాల్సిన 21 మందిలో 12 మంది హైదరాబాద్ మహానగరానికి చెందిన నేతలే ఉండటం గమనార్హం.
వీరిలో సనత్ నగర్ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఎల్బీనగర్ డి. సుధీర్ రెడ్డి, ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి.. మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు చార్మినార్.. చాంద్రాయణగుట్ట.. బహదూర్ పుర.. యాకత్ పుర.. మలక్ పేట.. కార్వాన్.. మల్కాజిగిరి..గోషామహాల్ (అభ్యర్థిని ప్రకటించలేదు).. నాంపల్లి (అభ్యర్థి ప్రకటన పెండింగ్) ఉన్నారు.
తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు.. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులుగా ప్రకటించి.. బీఫారాలు అందని వారిలో కొందరి పేర్లు మారతాయన్న ప్రచారం అంతకంతకూ జోరుగా సాగటంతో గులాబీ పార్టీలో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. తలసాని లాంటి బలమైన నేత బీఫారం ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.