'బీఆర్ఎస్' పుట్టిందే తెలంగాణ కోసమా? ఎట్టెట్టా? అదెలా..?
ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయి పదేళ్లవుతోంది.. మరో ఆరేడు నెలల్లో హైదరాబాద్ ‘‘ఉమ్మడి రాజధాని’’ అనే ట్యాగ్ కూడా పోతుంది.
ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయి పదేళ్లవుతోంది.. మరో ఆరేడు నెలల్లో హైదరాబాద్ ‘‘ఉమ్మడి రాజధాని’’ అనే ట్యాగ్ కూడా పోతుంది. ఈలోగా ఇటు తెలంగాణలో అటు ఏపీలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఇప్పుడున్నవారు గెలవడమో..? ప్రతిపక్షాలు అధికారంలోకి రావడమో జరుగుతుంది. మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జోరు పెరుగుతోంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేపథ్యంలో అన్ని పార్టీలు దూకుడుగా వెళ్తున్నాయి. అధికార బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.
ప్రసంగం.. ప్రవాహం
ప్రత్యర్థులను తన విమర్శలతో చెడుగుడు ఆడే కేసీఆర్.. ప్రసంగంలో వారిపై చేసే విమర్శలు చర్చనీయాంశంగా మారతాయి. ఆదివారం ఖమ్మం సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. పువ్వాడ అజయ్‌ని గెలిపిస్తే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారని.. తుమ్మలు, తుప్పలన తెచ్చుకుంటే ముళ్లు గుచ్చుకుంటాయని పరోక్షంగా మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి విమర్శించారు. ఇక పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలనూ ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఒక్కరిని కూడా అసెంబ్లీ గడప తొక్కనీయనని అర్భకుడు మాట్లాడుతున్నాడని.. పొంగులేటిపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆయన కాంట్రాక్టర్ అనే ఉద్దేశంలో.. ఆయనేమైనా ఖమ్మం ప్రజలను గుత్తపట్టారా? జిల్లాను కొనేశారా? ఇలాంటి వ్యక్తిని జిల్లా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు సహిస్తారా??’’ అని ప్రశ్నించారు.
ఖమ్మం సభలు.. ప్రశ్నలు
బీఆర్ఎస్ అధినేత ఆదివారం ఉమ్మడి ఖమ్మంలో పర్యటించారు. ఖమ్మం, కొత్తగూడెం సభల్లో ప్రసంగించారు. ఎమ్మెల్యే అభ్యర్థులు పువ్వాడ, వనమా తరఫున ప్రచారం చేశారు. కాగా, ఈ సందర్భంగానే కేసీఆర్ చేసిన పలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం’’ అని పేర్కొన్నారు. అంతేకాక ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని కూడా వ్యాఖ్యానించారు. ఈ రెండూ కాస్త భిన్నంగా ఉండడంతో రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
2001లో తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను స్థాపించారు కేసీఆర్. అనేక ఉద్యమాలు, రాజకీయ పోరాటాలతో 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా ఓర్చుకుని లక్ష్యం సాధించారు. కాగా, కేసీఆర్ విజయంలో ఆయన వాక్చాతుర్యం ప్రధాన పాత్ర పోషించింది. మంచి వక్త అయిన కేసీఆర్.. ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడి తెలంగాణ సెంటిమెంట్ ను పుట్టించారు. ప్రత్యర్థులు సైతం కేసీఆర్ అత్యద్భుత వక్త అని ఒప్పుకొంటారు. కాగా, అలాంటి కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన 8 ఏళ్లకు తన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీని చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. ఏపీకి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున నాయకులను చేర్చుకున్నారు. తాజాగా ఖమ్మం సభలో మాత్రం బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పుట్దిందే తెలంగాణ కోసం అంటూ అనేక ఎన్నికల్లో ప్రచారం చేసిన కేసీఆర్ ఇప్పుడు అలవాటులో పొరపాటున బీఆర్ఎస్ అనేశారని స్పష్టమవుతోంది.