సెగ్మెంట్ ఇష్యూ: బీఆర్ ఎస్‌కు 'ప‌ర‌కాల' ప‌రేషాన్‌!

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల వ్య‌వ‌హారం.. ఆయా పార్టీల‌కు ఇబ్బందిగా మారింది.

Update: 2023-10-29 10:33 GMT

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల వ్య‌వ‌హారం.. ఆయా పార్టీల‌కు ఇబ్బందిగా మారింది. అధికార‌పార్టీకి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు ప‌రీక్ష పెడుతుండ‌గా.. కొన్ని చోట్ల ప్ర‌తిప‌క్షాలు కూడా ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్‌ను భారీ గ‌డ‌బిడ‌కు గురిచేస్తున్న నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల‌. హ‌నుమ‌కొండ జిల్లాలోని కీల‌క‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్ గెలుపుపై అంచ‌నాలు త‌ప్పుతున్నాయని అంటున్నారు.

గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి చ‌ల్లా ధ‌ర్మారెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. 2014లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ధ‌ర్మారెడ్డి.. త‌ర్వాత బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుని గ‌త ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేశారు. ఇక, ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ చ‌ల్లాకే టికెట్ ఇచ్చారు. అయితే.. వ‌రుస విజ‌యాలు సాధించినా.. స్థానికంగా చ‌ల్లాకు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. మ‌రోవైపు.. సొంత పార్టీ నాయ‌కులు కూడా ఆయ‌నంటే విమ‌ర్శ‌లు గుప్పిస్తున‌నారు.

త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని, క‌నీసం త‌మ స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్క‌రించే తీరిక లేకుండా వ్య‌వ‌హ‌రించార‌ని ప‌లువురు నాయ‌కులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. టికెట్ల కేటాయింపున‌కు ముందే.. చ‌ల్లాకు టికెట్ వ‌ద్దంటూ కొంద‌రు వ్య‌తిరేక వ‌ర్గం ఆయ‌న‌పై ధ్వ‌జ‌మెత్తింది. అయితే.. కేటీఆర్ ద‌న్నుతో చ‌ల్లా టికెట్ సంపాయించుకున్నారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్క‌డ టికెట్ సొంతం చేసుకున్న రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి దూకుడు పెంచారు.

టికెట్ ప్ర‌క‌ట‌న రాగానే ఆయ‌న బీఆర్ ఎస్ నుంచి నేత‌ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో వంద మంది బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు తాజాగా కాంగ్రెస్ బాట ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం ఎంపీపీ మార్క సుమలత రజినీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, నీరుకుళ్ల‌ ఎంపీటీసీ అర్షం వరుణ్ గాంధీ తదితరులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరారు. వీరంతా స్థానికంగా ప‌ట్టున్న నాయ‌కులు కావ‌డంతో వీరి చేరిక కాంగ్రెస్‌కు క‌లిసి రానుండ‌గా.. బీఆర్ ఎస్‌కు షాకిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News