మాజీలు వద్దు.. ఎమ్మెల్యేలే ముద్దు!
మరోవైపు మునిగిపోయే పడవలాంటి బీఆర్ఎస్‌లో ఉండటం కంటే జంప్ అవడమే మేలు అని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారని టాక్.
తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, పల్లా రాజేశ్వర్ మాత్రమే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే లక్ష్యంతో రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకునే విషయంలో రేవంత్ కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్లను మాత్రమే రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పటికే తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరారు. ఇప్పుడు మరో 20 మంది బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్‌లో టచ్‌లో ఉన్నట్లు దానం నాగేందర్ చెబుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా ఇతర నాయకులు పార్టీలో చేరబోతున్నారని అన్నారు.
మరోవైపు మునిగిపోయే పడవలాంటి బీఆర్ఎస్‌లో ఉండటం కంటే జంప్ అవడమే మేలు అని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారని టాక్. గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు కూడా బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పాలకుర్తిలో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. కానీ రేవంత్ మాత్రం ఓడిపోయిన నేతలకు తలుపు తెరవట్లేదని తెలిసింది. ఇలాంటి నాయకుల వల్ల ఎలాంటి లాభం లేదన్నది రేవంత్ అభిప్రాయం. అందుకే ఇలాంటి మాజీలను చేర్చుకుని సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం కంటే వీళ్లకు నో చెప్పేందుకే రేవంత్ మొగ్గు చూపుతున్నారని టాక్.