గులాబీ బాస్ కు సింగరేణి షాక్.. తీవ్రత ఎంత ఎక్కువంటే?

అలాంటి కేసీఆర్ కు గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి అంతా మారిపోయింది.

Update: 2024-03-27 06:18 GMT

అధికారంలో ఉన్నప్పుడు అందరూ బంధువులు.. స్నేహితులే. కానీ.. ఒక్కసారి చేతిలో ఉన్న అధికారం చేజారితో లెక్కలు మారిపోతాయి. సమీకరణాల్లో తేడాలు వెలుగు చూస్తాయి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో గులాబీ బాస్ కు ఎత్తుపల్లాల గురించి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకుంటే.. గడిచిన పదేళ్లలో ఆయన ఏం అనుకుంటే అదే జరిగేది. కాలం సైతం ఆయన్ను పరీక్షించలేదు సరికదా.. ఆయనే కాలానికి పరీక్ష పెట్టారన్న మాట వినిపించేది. అలాంటి కేసీఆర్ కు గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి అంతా మారిపోయింది.

కలలో కూడా ఊహించని ఓటమి ఎన్నికల్లో ఎదురుకావటమే కాదు.. అధికారం చేజారింది. కాంగ్రెస్ పార్టీకి విజయం వరించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయినప్పటికీ మహా అయితే నెల చాటు ప్రభుత్వం పడిపోవటానికి అన్న ధీమాతో మొదలైన ఎదురుదెబ్బలు.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున తగులుతూనే ఉన్నాయి. చూస్తుండగానే వంద రోజులు గడిచిపోయాయి. ఏం చేస్తాడులే అన్న రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి.

ఊహించని పరిణామాలు.. అంచనాలకు మించిన నష్టాలు ఎదురవుతున్నాయి. గులాబీ బాస్ కుమార్తె కవితను ఈడీ అరెస్టు చేయటం మొదలు.. కలలో కూడా పక్కకు వెళ్లరనుకున్న పలువురు నేతలు కారు నుంచి వీడిపోవటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఎన్నికలు వస్తే.. అభ్యర్థుల రేసులో కుప్పలు కుప్పలుగా ఉండే స్థాయి నుంచి మీరు పోటీ చేయాలని గులాబీ బాస్ కోరినా.. సారీ.. ఆ పని మాత్రం చేయలేమంటూ ముఖానే చెప్పేసే దుస్థితి. ఇన్ని ఎదురుదెబ్బల వేళ.. మరో ఎదురుదెబ్బ తాజాగా తగిలింది.

కీలకమైన పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఇకపై తాను బీఆర్ఎస్ తో కలిసి అడుగులు వేయనని తేల్చి చెప్పింది. తమకు కారు పార్టీతో సంబంధాలు తెగిపోయిన వైనాన్ని వెల్లడించింది. గులాబీ పార్టీతో తాము తెగతెంపులు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇకపై తాము స్వతంత్రంగా వ్యవహరిస్తామన్న విషయాన్నిఅధికారికంగా ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంఘం దూరమైన నేపథ్యంలో వరంగల్.. పెద్దపల్లి.. అదిలాబాద్.. ఖమ్మం ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు దూరం కానున్నాయి. ఇప్పటికే వరుస షాకులతో కిందా మీదా పడుతున్న పెద్ద సారుకు సింగరేణి కార్మిక సంఘం నుంచి తగిలే షాక్ మరింత భారీగా ఉండటమే కాదు..కీలక ఎన్నికల్లో విజయవకాశాల్ని తగ్గించేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News