లోక్‌ సభ ఎన్నికలు.. బీఆర్‌ఎస్‌ ఊహించని వ్యూహం!

అతి విశ్వాసంతో వరుసగా మూడోసారి గెలిచేస్తామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన బీఆర్‌ఎస్‌ రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ చేతిలో చిత్తయింది.

Update: 2024-01-20 11:30 GMT

అతి విశ్వాసంతో వరుసగా మూడోసారి గెలిచేస్తామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన బీఆర్‌ఎస్‌ రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ చేతిలో చిత్తయింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమైతే పార్టీ మరింత ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయమని ఆ బీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురికి తప్ప సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సీట్లు ఇచ్చారు. ఇదే కొంపముంచిందని ఇప్పుడు ఆ పార్టీ భావిస్తోంది. కేసీఆర్‌ మీద ఎలాంటి వ్యతిరేకత లేదని.. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతోనే తాము ఓడిపోయామని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనవారు పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించారు. ఎంపీలుగా పోటీ చేసి గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొదట బీఆర్‌ఎస్‌ అధిష్టానం కూడా అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయినవారిలో బలమైనవారిని పార్లమెంటుకు బరిలో దింపాలని భావించింది.

అయితే ఎమ్మెల్యేలుగా ప్రజలు గెలిపించనివారిని మళ్లీ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపితే మరోసారి తలబొప్పి కట్టడం ఖాయమని బీఆర్‌ఎస్‌ అధిష్టానం అంచనాకొచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేసినవారెవరికీ పార్లమెంటు అభ్యర్థులుగా సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు సమాచారం.

అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఎన్నికల ప్రచార బాధ్యతల నుంచి కూడా దూరంగా ఉంచాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది

పార్లమెంటు ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్సీలకు అప్పగించాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో వెనుక ఉంటారు. ముందుండి ప్రచారాన్ని నడిపించేది ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు, అలాగే ఎమ్మెల్సీలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు

అలాగే తమ మిత్రపక్షం ఎంఐఎంకు హైదరాబాద్‌ ను వదిలేయగా మిగతా 16 లోక్‌ సభా స్థానాల్లోనూ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులెవరూ బరిలో ఉండకపోవచ్చని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఈ 16 మందిలో అత్యధికం కొత్తవారే ఉంటారని.. ఒకటి, రెండు చోట్ల సిట్టింగులకు సీట్లు ఇవ్వొచ్చని అంటున్నారు. అది కూడా సిట్టింగ్‌ ఎంపీలపై వ్యతిరేకత లేకుంటేనని పేర్కొంటున్నారు. సిట్టింగ్‌ ఎంపీలపై వ్యతిరేకత ఉంటే వారిని కూడా మార్చేయడం ఖాయమేనని సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందో వచ్చే ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News