60 ఏళ్ల క్రితం బుడమేరుకు వరద.. వైరల్ గా అప్పటి పేపర్!

ఇప్పుడే కాదు అరవై ఏళ్ల క్రితం కూడా బుడమేరుకు వచ్చిన వరద ఉక్కిరిబిక్కిరి చేసింది.

Update: 2024-09-09 04:38 GMT

ఇప్పుడే కాదు అరవై ఏళ్ల క్రితం కూడా బుడమేరుకు వచ్చిన వరద ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనికి సంబంధించిన సజీవ సాక్ష్యం ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 60 ఏళ్ల క్రితం బుడమేరకు వచ్చిన వరద నేపథ్యంలో అప్పట్లో ప్రముఖ దినపత్రికల్లో ఒకటైన ఆంధ్రపత్రిక ఈ వార్తను మొదటి పేజీలో బ్యానర్ వార్తగా ప్రచురించింది. దీనికి సంబంధించిన నాటి పేపర్ క్లిప్ నేడు వైరల్ గా మారింది.

అప్పుడు ఉగ్రరూపం దాల్చిన బుడమేరు కన్నెర్రతో అజిత్ సింగ్ నగర్.. సత్యనారాయణపురం ప్రాంతాల్లో వరద బీభత్సాన్ని కళ్లకు కట్టినట్లుగా రిపోర్టు చేశారు. అప్పటి అనధికారిక లెక్కల ప్రకారం పది మంది గల్లంతైనట్లుగా అందులో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పశువులు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రాయులయ్యారు. బుడమేరు వరద నుంచి రక్షణకు అప్పటి అధాకార యంత్రాంగం చేసిన సూచనలు.. ప్రత్యామ్నాయాలను సదరు కథనంలో వివరించారు.

దాదాపు 60 ఏళ్లు గడిచిన తర్వాత మళ్లీ బుడమేరు అప్పటి తరహాలోనే ఉప్పొంగటం.. పలు ప్రాంతం జలమయం కావటం.. వేలాది మంది తీవ్ర అవస్థలకు గురికావటం తెలిసిందే. ఇక.. అప్పటి విషయానికి వస్తే.. అర్థరాత్రి వేళ గండి పడటంతో అజిత్ సింగ్ నగర్ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. అప్పట్లో 2 వేలకు పైగా గుడిసెలు జలమయం అయ్యాయి. ఆ ప్రాంతంలో అప్పట్లో ఒక్కటే డాబా ఉండేదన్న విషయం నాటి పేపర్ లో పేర్కొన్నారు. చాలామంది ఆ భవనం ఎక్కి తమ ప్రాణాల్నికాపాడుకున్నారు.

ముంపు బారిన పడిన ప్రజల్నిసురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేయటం.. పడవల్ని ఏర్పాటు చేసినా వరద తీవ్రతతో తరలింపు సాధ్యం కాలేదు. అప్పట్లో అక్కడే ఉన్న ఆంధ్రా సిమెంట్ కంపెనీ ఆవరణలో నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచింది. అప్పట్లో వచ్చిన వరదలకు రైల్వే కాలనీ సైతం జలమయం అయిన విషయాన్ని రిపోర్టు చేశారు. బుడమేరుపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి 1941-45 మధ్య కసరత్తు జరిగింది. ఇందులో భాగంగా శాస్త్రీయ పరిశోధన కూడా చేశారు.

కానీ.. అదేమీ ఆచరణలోకి రాలేదు. తర్వాతి కాలంలో ముత్యాలం పాడు నుంచి కొల్లేరు వరకు వరద కట్టల్ని నిర్మించాలని భావించారు. ఈ పథకంతో ప్రయోజనం ఉండదని.. రిజర్వాయర్ నిర్మిస్తే 3-4 లక్షల ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వస్తుందని.. వరద బాధ తప్పుతుందని .. ఖఱ్చు కూడా కోటి రూపాయిల నుంచి కోటిన్నరకు మించదని అప్పట్లో ఆంధ్రప్రభ పేపర్ లో పేర్కొనటం గమనార్హం. రిజర్వాయర్ నిర్మాణం కోసం అప్పట్లో రైతులే రూ.15 వేలు చొప్పున విరాళాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా రిపోర్టు చేశారు. కానీ.. అవేమీ ఆచరణలోకి రాకపోవటం.. తాజాగా విరుచుకుపడిన వరద ముంపుతో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఏదో ఒక చర్య తీసుకొని ఉండి ఉంటే.. ఈ రోజు ఇంతటి నష్టం వాటిల్లేది కాదని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News