విశాఖ ఎమ్మెల్సీ పోరు : గుడివాడ వర్సెస్ గండి బాబ్జీ ?

వైసీపీ అయితే మాజీ మంత్రులు ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది. అందులో బూడి ముత్యాలనాయుడు, అలాగే గుడివాడ అమర్నాధ్ ఉన్నారని అంటున్నారు.

Update: 2024-08-02 04:17 GMT

విశాఖలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తెర లేచింది. ఆగస్టు 30న జరగనున్న ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ ఎన్నికతో అధికార కూటమి మరోసారి తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. వైసీపీ అయితే నైతికంగా తమ సీటు కాబట్టి దక్కించుకోవాలని చూస్తోంది.

వాస్తవంగా చూస్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615 ఓట్లు కచ్చితంగా ఉన్నాయి. మరో వైపు అధికారంలో ఉన్న టీడీపీ జన సేన బీజేపీ కూటమికి 215 మంది సభ్యుల మద్దతు ఉంది.

అంటే రెండింతల బలంతో వైసీపీ ఉంది. అయితే ఫిరాయింపులను పెద్ద ఎత్తున అధికార కూటమి ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా కూటమి వైపు చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జీవీఎంసీ నుంచి ఏకంగా 12 మంది కార్పోరేటర్లు ఫిరాయించారు. మరింతమంది ఫిరాయించేలా ఉన్నారు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా ఫిరాయించే జాబితాలో ఉన్నారు.

ఇది కూటమికి ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాబట్టి గట్టిగానే పట్టుబడుతుంది. పదునైన వ్యూహాలను రచిస్తుంది. అదే దూకుడు వైసీపీ కొనసాగించగలదా అన్నదే సందేహం. వైసీపీ అయితే మాజీ మంత్రులు ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది. అందులో బూడి ముత్యాలనాయుడు, అలాగే గుడివాడ అమర్నాధ్ ఉన్నారని అంటున్నారు.

జగన్ కి అత్యంత ఇష్టుడైన గుడివాడ పేరునే ఖరారు చేస్తున్నారు అని అంటున్నారు. గుడివాడ కూడా మూడేళ్ళకు పైగా పదవీ కాలం ఉన్న ఎమ్మెల్సీగా పనిచేసేందుకు సిద్ద్ధంగా ఉన్నారు. నెగ్గితే ఆయన వాయిస్ తో వైసీపీ ఎంతో కొంత సిటీలో ఉనికి చాటుకుంటుందని అంటున్నారు.

అయితే గుడివాడ అభ్యర్ధిత్వం పట్ల సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. ఆయనకు బదులుగా వేరే వారికి చాన్స్ ఇవ్వాలని అంటున్నారు. అయితే ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పెద్ద ఎత్తున ఆర్ధికంగా నష్టపోయిన వారు ఎవరూ ముందుకు రావడం లేదు, కొత్త ముఖాలను పెట్టి వైసీపీ రిస్క్ చేయదలచుకోలేదు అని అంటున్నారు.

బూడి ముత్యలనాయుడుకు చాన్స్ ఇవ్వవచ్చు కానీ ఆయన సాఫ్ట్ గా ఉంటారని కూటమితో దూకుడు చేయలేరని అంటున్నారు. మొత్తానికి గుడివాడకే చాన్స్ అని అంటున్నారు. ఇక టీడీపీ నుంచి గండి బాబ్జీకి కన్ ఫర్మ్ అని అంటున్నారు. ఆయన విశాఖ సౌత్ లేదా పెందుర్తి సీటుని ఆశించారు. కానీ అవి పొత్తులలో ఇవ్వలేకపోయారు. దాంతో ఎమ్మెల్సీగా ఆయనకు చాన్స్ ఇస్తే న్యాయం చేసినట్లు అవుతుందని టీడీపీ భావిస్తోంది.

ఇక గండి బాబ్జీని గెలిపించే బాధ్యతను జిల్లా పార్టీ నేతలకు టీడీపీ అప్పగించింది. టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పల్ల శ్రీనివాస్ కూడా విశాఖ వాసి కావడంతో ఆయనకు ఈ ఎన్నికలు తొలి టెస్ట్ గా మారుతున్నాయి. టీడీపీ అర్ధబలం అంగబలం ముందు వైసీపీ ఎంతవరకూ తట్టుకుంటుందో తెలియదు కానీ వైసీపీ ఎమ్మెల్సీ సీటు గెలిస్తే మాత్రం అద్భుతమే అని అంటున్నారు. మెజారిటీ బయటకు వైసీపీకి కనిపిస్తున్నా వెన్నుపోట్లు ఫ్యాన్ పార్టీకి తప్పవని ప్రచారం కూడా సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News