బుల్ డోజర్ తో మెడికల్ షాపుల్ని పడగొట్టేశారు
కొత్త హెచ్చరికలు చేసే ధోరణి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మధ్యన ఎక్కువైంది. కొద్దిరోజులుగా హర్యానాలో జరుగుతున్న అల్లర్ల వేళ.. తాజాగా అక్కడి ప్రభుత్వం బుల్డోజర్లను రంగంలోకి దింపింది.
యూపీలో మొదలైన బుల్డోజర్ పాలన.. అంతకంతకూ వివిధ రాష్ట్రాలకు పాకుతోంది. నేరాలు చేసే నేరస్తుల ఆస్తులను బుల్డోజర్ తో కూల్చేయటం ద్వారా.. వారికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. దీనికి ఇతర కారణాల్ని చూపిస్తూ.. ఆస్తుల్ని కూల్చేయటం ద్వారా.. కొత్త హెచ్చరికలు చేసే ధోరణి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మధ్యన ఎక్కువైంది. కొద్దిరోజులుగా హర్యానాలో జరుగుతున్న అల్లర్ల వేళ.. తాజాగా అక్కడి ప్రభుత్వం బుల్డోజర్లను రంగంలోకి దింపింది.
వారం దాటినా హర్యానాలో చెలరేగిన అల్లర్లు ఒక కొలిక్కి రాలేదు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అల్లర్లు మొదలైన నుహ్ లో తాజాగా జిల్లా యంత్రాంగం బుల్డోజర్లను రంగంలోకి తీసుకొచ్చింది. శనివారం 24 మెడికల్ షాపులతో పాటు ఇతర దుకాణాల్ని కూల్చేశారు. ఇటీవల కాలంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఆస్తుల్ని కలిపితే మొత్తంగా 50-60 ఆస్తుల్ని బుల్డోజర్ తో కూల్చేయటం గమనార్హం.
తాజాగా నుహ్ లోని నల్హార్ లో ఉన్న షహీద్ హసన్ ఖాన్ మేవాటీ ప్రభుత్వ వైద్య కాలేజీ వద్దకు చేరుకున్న బుల్డోజర్లు.. భారీ భద్రత మధ్య దుకాణాల కూల్చివేతను షురూ చేశాయి. ఎందుకిలా? అని ప్రశ్నించిన వారికి అక్రమ నిర్మాణాలుగా చెబుతూ.. పాత నోటీసుల్ని చూపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే.. సీఎల్పీ ఉప నేత అఫ్తాబ్ అహ్మద్ ఈ కూల్చివేతల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అధికారులు మాత్రం కూల్చటం ఆపలేదు.
కొన్నేళ్లుగా ఉన్న మెడికల్ షాపుల్ని తాజాగా కూల్చేశారు. పాత తేదీలతో ఉన్న నోటీసుల్ని చూపిస్తూ.. పేదల ఇళ్లు.. దుకాణాల్ని కూల్చేయటాన్ని తప్పు పడుతున్నారు. అయితే.. అధికారులు మాత్రం తమ చర్యల్ని సమర్థించుకుంటున్నారు. ఇదిలా ఉంటే నుహ్ లో అల్లర్ల వెనుక పెద్ద ప్లాన్ ఉందని రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. కొండ మీద నుంచి కాల్పులకు దిగటం.. భవనాలపైన పెద్ద ఎత్తున రాళ్లు దొరకటం చూస్తే.. పథకం ప్రకారమే దాడికి దిగారన్న విషయం అర్థమవుతుందన్నారు. నిర్మాణాల కూల్చివేతలపై ప్రశ్నిస్తే.. ఆయన అల్లర్ల వెనుక కుట్ర ఉందని పేర్కొనటం గమనార్హం. అరెస్టుల భయంతో పలువురు అండర్ గ్రౌండ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.