కాంగ్రెస్లో రగిలిన కుంపటి

వరుసగా రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ మూడో సారి విజయం కోసం పావులు కదుపుతుండగా.. సానుకూల పరిస్థితులను వాడుకుని జెండా ఎగరేయాలని కాంగ్రెస్ చూస్తోంది.

Update: 2023-10-16 10:57 GMT

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రాష్ట్రంలో రాజకీయ సమరాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఓటర్ల ఆదరణను పొందేందుకు.. ఓట్ల రూపంలో మార్చుకునేందుకు పార్టీలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వరుసగా రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ మూడో సారి విజయం కోసం పావులు కదుపుతుండగా.. సానుకూల పరిస్థితులను వాడుకుని జెండా ఎగరేయాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ నేపథ్యంలోనే 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితా వచ్చిందో లేదో.. కాంగ్రెస్ లో కుంపటి రగిలింది. టికెట్ పై ఆశ పెట్టుకుని భంగపడ్డ నాయకులు అసంత్రుప్తి గళం వినిపిస్తున్నారు. కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటే.. మరికొంత మంది పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇంకొంతమంది కాంగ్రెస్ నాయకులేమో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు.

కాంగ్రెస్ లో మొదటి నుంచి టికెట్ల కోసం పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. 119 స్థానాల కోసం 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. మొదటి నుంచే టికెట్ల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు తొలి జాబితా వచ్చేసరికి అది మరింత ఎక్కువైంది. ఉప్పల్ టికెట్ రాకపోవడంతో ఆ నియోజకవర్గం కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. చాలా ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా పట్టించుకోలేదని లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే టికెట్ ఆశించిన పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఆయన భార్య ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీషా రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా ప్రకటించారు.

మేడ్చల్ టికెట్ రాకపోవడంతో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి టికెట్ దక్కిన వజ్రేశ్ యాదవ్ వెళ్లడంతో గొడవ జరిగింది. బహదూర్ పుర టికెట్ రాలేదని ఖలీమ్ బాబా, చాంద్రాయణగుట్ట టికెట్ దక్కలేదని షకీల్ దయానిలు గాంధీభవన్ లో ఆందోళనకు దిగారు. గద్వాల్ టికెట్ ఆశించి భంగపడ్డ కురువ విజయ్ కుమార్ కూడా గాంధీ భవన్లో ఆందోళన చేశారు. వీళ్లంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా రేవంత్ గద్వాల్ టికెట్ ను రూ.10 కోట్లకు అమ్ముకున్నారని విజయ్ తాజాగా ఆరోపించారు. మరి పూర్తి జాబితా విడుదలయ్యాక ఈ కుంపటి మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News